ప్రాజెక్టులను అప్పగిస్తే కష్టాలే!
నీటి పంపకాలు తేలకుండా
అప్పగింతతో నష్టం
పాలమూరు-రంగారెడ్డి,
ఎస్‌ఎల్‌బీసీకి తాళమే!
విద్యుత్తుకూ ఇబ్బందులేనని
రాష్ట్ర ప్రభుత్వ ఆందోళన
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగిస్తే.. రాష్ట్రానికి కష్టాలు ఎదురవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రెండు ప్రాజెక్టులను నెల రోజుల్లోగా బోర్డుకు అప్పగించాలన్న కేంద్రం ఆదేశాలను తాము అంగీకరించబోమని చెబుతున్నా..
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగిస్తే.. రాష్ట్రానికి కష్టాలు ఎదురవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రెండు ప్రాజెక్టులను నెల రోజుల్లోగా బోర్డుకు అప్పగించాలన్న కేంద్రం ఆదేశాలను తాము అంగీకరించబోమని చెబుతున్నా.. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అప్పగించాల్సి వస్తే పరిస్థితేంటన్న దానిపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రెండు ప్రాజెక్టులను కృష్ణా బోర్డు స్వాధీనం చేసుకున్నాక.. బచావత్ ట్రైబ్యునల్‌ను అనుసరించి నీటిని విడుదల చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. లేదంటే.. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాన్ని అనుసరించి నీటి విడుదల, నిర్వహణ నిబంధనలు ఉంటాయని పేర్కొంది. కానీ, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా నీటి కేటాయింపులు ఉన్నాయి. 2015 నుంచి రెండు రాష్ట్రాలు ఈ నీటిని ఏయేటికాయేడు తాత్కాలిక ప్రాతిపదికన పంచుకుంటున్నాయి. 811 టీఎంసీలను ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతంగా వాడుకుంటున్నాయి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నీటి విడుదల ఉత్తర్వులు ఇస్తోంది. అయితే రెండేళ్లుగా నీటి అవసరాలు పెరుగుతుండడంతో తెలంగాణ 50ః50 శాతం వాటా కావాలని పట్టుబడుతోంది. ఈ అంశం ఇంకా తేలనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే నష్టపోవాల్సివస్తుందన్న ఆందోళన నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు అప్పగించినా..
ఈ విచారణ కొలిక్కి రావడానికి మరో పదేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్ పదేళ్లపాటు విచారణ జరిపినా ఎటువంటి ఫలితం తేలని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నీటి వాటాలు తేలకుండా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే.. పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనా ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతుండగా.. దీని నిర్మాణానికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.26,738 కోట్లు ఖర్చు చేసింది. మరో రూ.24 వేల కోట్ల దాకా వెచ్చిస్తే 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు వేలాది గ్రామాలకు తాగునీరు అందించవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఇంకా అనుమతి లభించలేదు. పోలవరం ఖాతాలో లభించిన 45 టీఎంసీలపై ఉమ్మడి ఏపీకే అధికారం ఉందని, తెలంగాణకు ఆ నీరు దక్కాలంటే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగాల్సి ఉంటుందని సీడబ్ల్యూసీ ఇప్పటికే స్పష్టం చేసింది. 45 టీఎంసీలతో చేపడుతున్న ఎస్‌ఎల్‌బీసీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే.. ఈ ప్రాజెక్టులకు తాళం వేసుకోవాల్సిన పరిస్థితే వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జలవిద్యుదుత్పత్తికూడా కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే జరుగుతుంది. శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్ ప్రధాన, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల సామర్థ్యం 1775.6 మెగావాట్లు ఉండగా.. వీటన్నింటిపై తెలంగాణ నియంత్రణ కోల్పోనుంది. ఫలితంగా విద్యుత్తుకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.