మటన్, చికెన్ కంటే చేపలో చేవ ఎంత?




మటన్, చికెన్, గుడ్లతో పోలిస్తే చేపలు, రొయ్యల్లో అధిక పోషక విలువలు ఉంటాయి. అయినా వాటి వినియోగం మన దగ్గర తక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి మనిషి ఏటా 18 కిలోల చేపలను తినాలి. ప్రపంచంలో ఏటా సగటున 20.7 కిలోగ్రాముల చేపలను తింటుంటే అది మన దేశంలో 9 కిలోలు మాత్రమే. ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో యాసిడ్స్, అయోడిన్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్న చేపలను ఆహారంలో చేర్చుకోవాలని, వారానికి కనీసం రెండు సార్లయినా తినాలని కేంద్రమత్స్యశాఖ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. అయితే వాటిని కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటంటే...



చాలామంది వ్యాపారులు చనిపోయిన చేపలను రిఫ్రిజిరేటర్లలో, మంచు పెట్టెల్లో నిల్వ చేసి అమ్ముతారు. మార్కెట్లకు వెళ్లినప్పుడు తాజా చేపలను గుర్తించి వాటిని కొనుగోలు చేయాలి.

చేపలు, రొయ్యలను వాటి వాసనను బట్టి అవి ఎలాంటివో తెలుస్తుంది. ఎక్కువగా వాసన వస్తుంటే అవి తాజావి కాదని గుర్తించాలి.

చేప కొనేముందు దాన్ని నొక్కి.చూడాలి. అది మెత్తగా ఉంటే తాజాది కాదని గుర్తించాలి. తాజా చేపలు గట్టిగా ఉంటాయి.

చేపల మొప్పల రంగు ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉండాలి. నిస్తేజంగా, గోధుమ రంగు పొలుసులు ఉంటే ఆ చేప మంచిది కాదని అర్థం.

చేపల కళ్లు స్పష్టంగా ఉంటే అది తాజా చేప. అలాకాకుండా కను గుడ్డు లోపలికి వెళ్లినా, కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా, లేత రంగులో ఉన్నా వాటిని కొనకపోవడం మేలు.

బాగా ఉడికించాలి.. 

చేపలను బాగా ఉడికించి తినడం శ్రేయస్కరం. పులుసుతో పాటు చేపలను మంటపై లేదా కాల్చడం (గ్రిల్లింగ్‌), నూనె లేకుండా ఆవిరి సాయంతో ఉడికించడం (స్టీమింగ్‌) వల్ల చేపలోని పోషకాలు దెబ్బతినవు. వేపుడు చేయాలనుకుంటే తక్కువ నూనెలో వేయించాలి. లేకుంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల వంటి మంచి పోషకాలన్నీ నశిస్తాయి. ఎండు చేపల్లో ఉప్పుశాతం అధికంగా ఉంటే తీసుకోవద్దు.

ఉపయోగాలు అనేకం.. 

గుండెకు మేలు..: చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.


మెదడుకు మేత..: చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు-సంబంధిత అభిజ్ఞా క్షీణత, అల్జీమర్స్‌ వంటి న్యూరో డీజనరేటివ్‌ వ్యాధులను నివారిస్తుంది.

కంటిచూపు తగ్గకుండా..: చాలా రకాల చేపలలో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కార్నియాను ఆరోగ్యంగా ఉంచి చూపును మెరుగుపరుస్తుంది.



రోగ నిరోధక శక్తికి..: చేపలలోని విటమిన్‌ ఎ కండరాల పనితీరును మెరుగుపరిచి, అలసటను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. చేపలలో లీన్‌ ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కణజాలాన్ని నిర్మిస్తుంది.

సంపూర్ణ పోషకాహారం

లక్ష్మయ్య బోయిని, మత్స్యశాఖ సహాయ సంచాలకులు, తెలంగాణ

చేపలు, రొయ్యలు, పీతల వంటి జలచరాల ఆహారం ఆరోగ్యానికి శ్రేష్ఠమైంది. సులభంగా, సంపూర్ణంగా జీర్ణమవుతుంది. మిగిలిన మాంసాహారాలతో పోలిస్తే చౌకయింది. మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో లభించే కొర్రమీను, రాహు, బొచ్చె, శీలవతి, తిలాపియా, నీలకంఠి, పరకలు, కొరిపెలు తదితర అన్ని చేపల్లోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలుంటాయి.. చేపలను కొనేముందు వాటి స్థితిగతులు, వాతావరణం, ఎక్కడ పెరిగాయి, వాటి దాణా ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయి అనే వివరాలతో పాటు ఇతర జాగ్రత్తలు పాటించి కొనాలి. వీలైనంత మేరకు పులుసు రూపంలో వినియోగం మంచిది. విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాలి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow