ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. 2026 ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ల్యామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
సంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి 5 లక్షల ల్యామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పాలనలో రేషన్ కార్డుల పంపిణీ మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణలో ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఆన్లైన్లో మంజూరైనప్పటికీ, ఫిజికల్ కార్డులు ఇంకా అందని పరిస్థితి ఉంది. అయినప్పటికీ, ఆన్లైన్లో మంజూరైన కార్డుల ఆధారంగా పలువురు రేషన్ సరుకులు పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరికీ ఫిజికల్ స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.