ఇప్పటిదాకా ఈ పరిహారం రూ.5 లక్షలువిద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు
హైదరాబాద్: కరెంటు షాక్ తగిలి ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) డిస్కంలను ఆదేశించింది. ఈ నెల ఒకటోతేదీ నుంచే ఈ పెంపు అమల్లోకి తేవాలని సూచించింది. వినియోగదారుల పొరపాటు వల్ల విద్యుత్ ప్రమాదం జరిగినా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ప్రమాదం జరిగిన తర్వాత రెండు నెలల వ్యవధిలోగా పరిహారం చెల్లించకపోతే డిస్కంలు అందుకు కారణాలను తెలపాలని ఈఆర్‌సీ బుధవారం జారీచేసిన టారీఫ్ ఉత్తర్వులో స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా పాత కరెంటు ఛార్జీలే వర్తిస్తాయని తెలిపింది. వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచాలని డిస్కంలకు పలు మార్గదర్శకాలను జారీచేసింది.
ముఖ్యాంశాలు ఇలా...
- 2022-23, 2023-24లలో ఈఆర్‌సీ తొలుత అనుమతించినదానికన్నా అదనంగా రూ.7,635 కోట్ల వ్యయం పెరిగినందున ఈ మేరకు ట్రూఅప్ ఛార్జీలకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. కానీ ఈ సొమ్మును కరెంటు బిల్లుల ద్వారా వసూలుకు అనుమతించవద్దని, తామే ఒక నిర్ణయం తీసుకుని తర్వాత చెపుతామని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్‌సీకి తెలిపింది. రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నందున అది ముగిసేవరకు ఈ రూ.7,635 కోట్ల ట్రూఅప్ ఛార్జీలపై నిర్ణయం వాయిదా వేసినట్లు ఈఆర్‌సీ తెలిపింది.
- అనుమతి తీసుకున్న లోడుకన్నా అదనంగా కరెంటు వినియోగించే హైటెన్షన్(హెచ్‌టీ) వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయడాన్ని సమర్థిస్తూనే వారికి అవగాహన కల్పించకుండా తక్షణమే అమల్లోకి తెచ్చినందున తొలి రెండు నెలలు వసూలు చేసిన అదనపు బిల్లును తిరిగివ్వాలని డిస్కంలను ఆదేశించింది. వచ్చే ఆరునెలల బిల్లుల్లో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది.
- భవనాల పైకప్పు(రూఫ్‌టాప్)పై ఏర్పాటు చేసుకున్న సౌరవిద్యుత్ ప్లాంటు నుంచి వచ్చే కరెంటుకన్నా.. అదనపు యూనిట్లు వాడుకుంటే అధిక రేట్ల శ్లాబుల ప్రకారం డిస్కంలు ప్రస్తుతం బిల్లు వసూలుచేస్తున్నాయి. ఇలా అదనంగా వసూలుచేసిన సొమ్మును రాబోయే 3 నెలల కరెంటు బిల్లులో వెనక్కి ఇవ్వాలి.
- ఈ ఏడాది మొత్తం కరెంటు కొనుగోలు వ్యయం రూ.54,567 కోట్లకు అనుమతించాలని రెండు డిస్కంలు కోరగా విచారణ అనంతరం రూ.49,230 కోట్లకే ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది.
- ఈ ఏడాది మొత్తం అన్ని వ్యయాలు కలిపి రూ.72,996 కోట్లు అవుతాయని డిస్కంలు తెలపగా రూ.64,950.72 కోట్లకే అనుమతించింది.
- కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉత్తర, దక్షిణ డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.15,105.91 కోట్లు ఉంటుందని ఈఆర్‌సీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల కోట్లను ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు వివరించింది. మిగిలిన సొమ్మును డిస్కంల రెగ్యులేటరీ ఎసెట్ కింద పరిగణించాలని సూచించింది.
Tags
Hyderabad