Telangana BJP: కంచుకోట కల.. కమలంలో గుబులు.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది?


Telangana BJP: జాతీయ రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగిన కాషాయ పార్టీ, తెలంగాణలో మాత్రం ఎందుకు తడబడుతోంది..? దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణను తమకు కంచు కోటగా ములుచుకోవాలని చూస్తున్న కాషాయ పార్టీ ఎప్పటికప్పుడు ఎందుకు ఎందుకు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటోంది…? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితమైన బీజేపీ.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. అసలు తెలంగాణ బీజేపీలో ఈ పరిస్థితికి కారణమేంటి? రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాథమా? కీలక నేతల ఆధిపత్యాపోరా?

అధిష్టానం తలలు పట్టుకుంటున్న పరిస్థితి

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పాదయాత్రలు, సభలు, ప్రజా పోరాటాలతో బలంగా అడుగులు వేస్తామని గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ.. ప్రస్తుతం రాష్ట్రంలో గడ్డు కాలాన్నీ ఎదుర్కొంటుంది. వరుసగా వస్తున్న ప్రతి ఎన్నికల్లో వరుస పరాజయాలతో, రాష్ట్ర నేతల తీరు వ్యవహరిస్తున్న తీరు అర్థం కాక అధిష్టానం తలలు పట్టుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయట. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు సమన్వయానికి కృషి చేస్తున్నప్పటికీ, ఏ మాత్రం లెక్కచేయకుండా. పార్టీ అగ్రనేతల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడుతూనే ఉన్నాయి.

టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు

తాజాగా పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌కు విరుద్ధంగా ఎక్స్-అఫీషియో ఓట్లు ప్రత్యర్ధి పార్టీలకు వేయడం, క్యాంప్ రాజకీయాలు చేయడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో జతకట్టడం సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికల్లో లోకల్‌గా ప్రాబల్యం ఉన్న నేతలు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా రాష్ట్ర నాయకత్వాన్ని లెక్క చేయకపోవడం, అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరించడం అధిష్ఠానాన్నీ ఆగ్రహానికి గురిచేసిందన్న టాక్ నడుస్తోంది.

రెబల్ అభ్యర్ధుల తిరుగుబాటుతో బీజేపీ అయోమయం

టికెట్ల కేటాయించిన అభ్యర్థులకు పార్టీ నేతలు సహకరించపోవవడం, రెబల్ అభ్యర్థుల తిరుగుబాటుతో బీజేపీ క్యాడర్లో తీవ్ర అయోమయం నెలకొని, ఎన్నికల ఫలితాలపై రిఫ్లెక్ట్ అయింది. ఏ నేత ఏం చేస్తున్నారో, ఎవరు ఎప్పుడూ ఏం మాట్లాడుతారో తెలియని గందరగోళం పరిస్థితులు ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణం అయ్యాయన్న చర్చ ఆ పార్టీ నాయకత్వంలో నడుస్తుందట.

తెలంగాణ బీజేపీపై విమర్శల వెల్లువ

ఆ క్రమంలో అధికార కాంగ్రెస్‌ కి నేరుగా సవాల్ విసరలేకపోయారు కాషాయ నేతలు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను కూడా ఎదుర్కొన లేకపోయాయి. దాంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టలేకపోవడం, సొంత పార్టీలో రెబల్ అభ్యర్థులను నియంత్రించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తాజా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు లేవన్న విమర్శలు రాజకీయంగా బీజేపీనీ ఇరుకున పడేశాస్తున్నాయంట బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పడేసిందని కాంగ్రెస్ పార్టీ, విమర్శల దాడి చేస్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయకుండా అందుకు భిన్నంగా వ్యవహరించడం, అధికార, ప్రతిపక్ష పార్టీలకు కొమ్ముకాశారన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో రచ్చ రేపుతోంది.

అర్బన్‌లోనూ బీజేపీకి షాక్

రాష్ట్ర కమలం పార్టీకి గ్రామీణ స్థాయిలో ఆశించినంత స్థాయిలో బలం లేకపోయినప్పటికీ, ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే అంతో ఇంతో బలముందని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని ఆ పార్టీ నిరూపించుకోగలిగింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ లేకపోవడం, బీజేపీకి గ్రామీణ స్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకపోవడం వంటివి ఆ పార్టికి మైనస్ ఫలితాలు తెచ్చినప్పటికీ, బలం ఉందనుకున్న అర్బన్ ప్రాంతాల్లో కూడా అంతకన్నా దారుణంగా ఫలితాలు రావడం, ఆ పార్టీలో సైలెంట్ ప్రకంపనలు రేపుతున్నాయన్న చర్చ జరుగుతోందిది. ఈ సైలెంట్ ప్రకంపనలు వచ్చే అసెంబ్లీ వ్యూహాలకు సవాలుగా మారుతున్నాయన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

ఒకవైపు రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉందని స్వయంగా అధికారంలో ఉన్న పార్టీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంటే రాష్ట్రంలో బీజేపీ పోటీలో ఉందన్నది స్పష్టం అయింది. కానీ అందుకు భిన్నంగా బీజేపీ ఆ వైపుకు అడుగులు వెయడంలో విఫలం అవడం…కనీసం ప్రతిపక్ష పార్టీనీ ఎదుర్కొని, ఆ ప్లేస్ లోకి నిలబడేందుకు కూడా ట్రై చేయకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనతో ప్రజల్లో బలపడుతోంది. మరోవైపు గులాబీ పార్టీ తన ఉనికి కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ త్రిముఖ పార్టీల పోరులో బీజేపీకి స్పష్టమైన వ్యూహం, స్పష్టమైన విధానపరమైన ప్రణాళిక లేకపోవడం ఆ పార్టీ లక్ష్యాలకు గండి పడుతుoదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల వచ్చిన వ్యతిరేక ఓటును పూర్తిగా తమవైపు తిప్పుకోలేకపోయిందన్న విమర్శలతో పాటు, రెండేళ్ల అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడంలో ఘోరంగా ఫైఫల్యం చెందిందని బీజేపీ విమర్శలు మూడగట్టుకుంటోంది.

తెలంగాణ బీజేపీకి వ్యూహాల సవాల్

జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న పరివారులకు తెలంగాణలో మాత్రం సొంత ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అంతర్గత విభేదాలను అధిగమించి, గ్రామీణ స్థాయిలో బలం పెంచుకుని, స్పష్టమైన రాజకీయ దిశను నిర్ణయించుకోగలిగితేనే దక్షిణాది రాష్ట్రాలపై కాషాయ జెండా కల సాకారం అవుతుందన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయట.మరి తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం సాధ్యమేనా? లేక ఈ అంతర్గత సంక్షోభమే పార్టీకి పెద్ద అడ్డంకిగా మారుతుందా..? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది..? ఒకవేళ ఆ ఎన్నికల్లో కూడా ఇదే సేమ్ సీన్ ఎదురైతే, ఆపై వచ్చే ఎన్నికలు బీజేపీకి ప్రశ్నార్థకమేనా..? గడ్డుకాలమేనా..?అన్న సందేహాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow