ఈ ఫొటోలో ఉన్న వాడిని చూడండి. ఒకసారి కాదు, మళ్లీ మళ్లీ జాగ్రత్తగా చూడండి. వీడు చేసిన పని తెలిస్తే.. ఇలాంటి నాన్న ఉంటాడా? వీడు మనిషేనా? అని ఎవరికైనా అనిపిస్తుంది. అంతేకాదు, వీడు తండ్రినా.. రాక్షసుడా.. పశువునా అని ప్రశ్నించకుండా ఉండలేరు.
మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లు.. వారి వయస్సులు పదేళ్లు, పదకొండేళ్లు. ఇద్దరినీ ఇంట్లోనే ఒక ఇనుప కమ్మీకి తలకిందులుగా వేలాడదీసి రాత్రంతా చిత్రహింసలు పెట్టాడు. మంచినీళ్లు కావాలని అడిగినా ఇవ్వలేదు.
ఉదయం చూసేసరికి ఒక కూతురు మృతి చెందింది. మరో కూతురు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆసుపత్రిలో రెండో కూతురు చెప్పిన విషయాలు విని డాక్టర్లే షాక్ అయ్యారు. పోలీసులు కూడా ఈ ఘటన చూసి నోరెళ్లబెట్టారు.
కన్నకూతురు అని కూడా చూడకుండా, చిన్న దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ తండ్రి రాక్షసుడిలా మారాడు. పది ఏళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా ఒక రాత్రంతా తలకిందులుగా ఇంట్లో వేలాడదీసి ఆమె ప్రాణాలు విడిచే వరకు కనికరం లేకుండా ప్రవర్తించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కలకలం రేపింది.
ఆకలివేస్తే అమ్మ అని, ఆపద వస్తే నాన్న అని అరిచే ఆ పసిప్రాణం.. తన తండ్రి చేతుల్లోనే చిత్రహింసలకు గురై మరణించడం అందరినీ కలచివేస్తోంది.
సాంగ్లీ జిల్లాలో జరిగిన ఘటన
సాంగ్లీ జిల్లా ఆట్పాడి తాలూకాకు చెందిన దాదూ అలియాస్ నానా యమ్గర్ అనే రైతుకు ఇద్దరు కుమార్తెలు రుతుజ (10), అనుజ (11). బంధువుల ఇంట్లో ఈ పిల్లలు డబ్బులు దొంగిలించారని అనుమానించిన ఆ తండ్రి.. వారు చెప్పేది వినే ప్రయత్నం కూడా చేయలేదు.
ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. పశువుల కంటే హీనంగా ఇద్దరు కుమార్తెల కాళ్లు చేతులు కట్టేసి ఇంటి కప్పుకు ఉన్న ఇనుప యాంగిల్‌కు తలకిందులుగా వేలాడదీశాడు. ఆ పసిపిల్లలు భయంతో వణికిపోతూ, నొప్పితో విలవిలలాడుతూ రాత్రంతా అలాగే ఉండిపోయారు.