**అప్పుల బారి… ఇంటికి తాళం

 

**అప్పుల బారి… ఇంటికి తాళం

కిడ్నీ వ్యాధితో యువకుడు మృతి – అంత్యక్రియలకు సైతం డబ్బుల్లేని దుస్థితి**

మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం, దోనూరు (ప్రతినిధి)

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన కమ్మరి ప్రసాద్ ఆచారి (30) కిడ్నీలు ఫెయిల్ కావడంతో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కుటుంబం ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా డబ్బుల్లేని దుస్థితిలో ఉందని సమాచారం.

ప్రసాద్ ఆచారి జడ్చర్లలోని శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక అప్పుల పాలవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికి తాళం వేసినట్లు సమాచారం. చుట్టుపక్కల వారి సలహా మేరకు, శవాన్ని ఒక రాత్రి పాటు ఇంట్లో ఉంచుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.

అయితే స్వగ్రామమైన దోనూరులో కూడా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో, శవాన్ని ఓపెన్ ప్లాట్‌లో టెంట్ ఏర్పాటు చేసి ఉంచిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. కనీసం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా ఆర్థిక స్థోమత లేదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రసాద్ ఆచారికి పెళ్లి కాలేదని, కుటుంబం పూర్తిగా అప్పుల బారిన పడిందని స్థానికులు చెబుతున్నారు.

అంత్యక్రియల నిర్వహణకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కుటుంబ పరిస్థితులు ఈ స్థితికి ఎలా చేరుకున్నాయన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow