ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న పది రోజుల తర్వాత.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు బుకింగ్‌ల మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ రూల్ మార్పును వినియోగదారులు గమనించాలని కేంద్రం సూచించింది. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందాను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. LPG ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా చాలా నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే నిలిచిపోయింది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మెయింటైన్ చేయడం భారమైపోయిందని.. బెంగళూరులో హోటళ్లు మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇండ్లలో వంట కోసం వాడే డొమెస్టిక్ ఎల్‌పీజీ 14 కిలోల సిలిండర్ ధరను కేంద్ర ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇప్పటికే సిలిండర్పై రూ.60 పెంచిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గడిచిన 11 నెలల్లో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. 2025 ఏప్రిల్లోనూ ధరలను పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913 కు చేరింది.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. వీరికి వచ్చే రూ.300 సబ్సిడీ పోగా సిలిండర్ ధర రూ.613 గా ఉంటుంది. వాణిజ్య అవసరాలకు వాడే 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా రూ.114.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో దీని ధర రూ.1,883కు చేరింది. ఈ ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.302 పెరిగింది.
కేంద్రం కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో.. డొమెస్టిక్ సిలిండర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని గ్యాస్ కంపెనీలను ఆదేశించడం గమనార్హం. ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా యధేచ్ఛగా సాగుతోంది. ఒక్కో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ను రూ.15 వందల వరకూ బ్లాక్లో అమ్ముతున్నారు.
Tags
india