ఇప్పపువ్వు టకీలా… పదేళ్లలో మెక్సికో టకీలాను అధిగమిస్తుంది: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పపువ్వు – అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 



జడ్చర్ల, మార్చి 25: ఇప్పపువ్వుతో తయారు చేసే సాంప్రదాయ మద్యాన్ని ఆధునికంగా అభివృద్ధి చేసి ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకెళితే పదేళ్లలోనే మెక్సికో టకీలాను కూడా అధిగమించే అవకాశం ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికీ, ఆదివాసీ గిరిజనులకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు.

బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన, ఇప్పపువ్వు మద్యానికి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉందని పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకులు తమ విదేశీ మద్యం అమ్మకాలు తగ్గిపోతాయని భావించి 1892లో మోవ్రా యాక్ట్ ద్వారా ఇప్పపువ్వు మద్యాన్ని నిషేధించారని ఆరోపించారు.

ప్రపంచంలోని అనేక దేశాలు తమ సాంప్రదాయ మద్యాలను అంతర్జాతీయంగా విక్రయించి భారీ ఆదాయాన్ని పొందుతున్నాయని ఆయన వివరించారు. మెక్సికోలో అగావే మొక్కతో తయారు చేసే టకీలా ద్వారా ఏడాదికి సుమారు రూ.2.35 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. అలాగే చైనా, జపాన్, స్కాట్లాండ్ దేశాలు కూడా తమ సాంప్రదాయ మద్యాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయని చెప్పారు.

మన దేశంలో ఇప్పపువ్వుతో తయారు చేసే సాంప్రదాయ మద్యం కూడా అంతే విలువైనదని ఆయన పేర్కొన్నారు. ఇప్పసారా అనే పదానికి ఉన్న ప్రతికూల భావనను తొలగించేందుకు దీనిని “ఇప్ప సురా” లేదా “ఇప్ప టకీలా”గా అభివృద్ధి చేయాలని సూచించారు.

ఇప్పపువ్వులో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ వంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పపువ్వుతో మద్యం మాత్రమే కాకుండా ఎనర్జీ డ్రింక్, లడ్డూలు వంటి ఉత్పత్తులు కూడా తయారు చేయవచ్చని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇప్పపువ్వు లడ్డూలను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్, గోవా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఇప్పపువ్వుతో తయారయ్యే మద్యానికి ప్రభుత్వాలు అధికారిక అనుమతులు ఇచ్చాయని తెలిపారు. దీంతో లక్షలాది ఆదివాసీ కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 5 నుంచి 10 లక్షల ఇప్ప చెట్లు ఉన్నాయని, ఒక్క చెట్టు నుంచి ఏడాదికి సుమారు 200 కిలోల ఇప్పపువ్వు లభిస్తుందని తెలిపారు. ఒక ఎకరాలో 50 నుంచి 60 ఇప్ప చెట్లు పెంచి ఏడాదికి సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు.

ఈ నేపథ్యంలో ఇప్పపువ్వుతో మద్యం తయారీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదివాసీలను భాగస్వాములుగా చేస్తే భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించారు.

 • ఇప్పపువ్వుతో తయారు చేసే మద్యం (మహువా)కు సుమారు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. • బ్రిటీష్ పాలకులు తమ విదేశీ మద్యం అమ్మకాలు తగ్గిపోతాయని భావించి 1892లో మోవ్రా యాక్ట్ ద్వారా ఇప్ప మద్యాన్ని నిషేధించారు. • ఇప్పపువ్వుతో తయారు చేసే మద్యం ను ఆధునికంగా తయారు చేసి “ఇప్ప సురా” లేదా “ఇప్ప టకీలా”గా ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లాలి అని సూచించారు. • మెక్సికోలో అగావే మొక్కతో తయారు చేసే టకీలా ద్వారా ఏడాదికి సుమారు ₹2.35 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. • జపాన్ (సాకే), చైనా (మహుటాయ్), స్కాట్లాండ్ (స్కాచ్) లాంటి దేశాలు సాంప్రదాయ మద్యం ద్వారా భారీ ఆదాయం పొందుతున్నాయి. • అదే విధంగా భారత్‌లో కూడా ఇప్పపువ్వుతో తయారు చేసే మద్యాన్ని ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకెళితే భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. • ఇప్పపువ్వులో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ వంటి ఔషధ గుణాలు ఉన్నాయని పేర్కొన్నారు. • ఇప్పపువ్వుతో మద్యం ఎనర్జీ డ్రింక్ (ఇప్ప కోలా) లడ్డూలు వంటి ఉత్పత్తులు తయారు చేయవచ్చు. • ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్‌లో ఇప్పపువ్వు లడ్డూలను ప్రశంసించారు. • మధ్యప్రదేశ్, గోవా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఇప్పటికే ఇప్పపువ్వు మద్యం తయారీకి అధికారిక అనుమతులు ఇచ్చాయి. • ఈ రంగం ద్వారా లక్షలాది ఆదివాసీ కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. • ప్రస్తుతం తెలంగాణలో 5–10 లక్షల ఇప్ప చెట్లు ఉన్నాయని తెలిపారు. • ఒక చెట్టు ద్వారా ఏడాదికి సుమారు 200 కిలోల ఇప్పపువ్వు లభిస్తుంది. • ఒక ఎకరాలో 50–60 ఇప్ప చెట్లు పెంచి ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. • ఇప్ప చెట్లు ఎరువులు లేకుండా కూడా 100 సంవత్సరాల వరకు జీవిస్తాయి. • ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్ప టకీలా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆదివాసీలకు భారీ ఆర్థిక లాభం కలుగుతుందని సూచించారు. • వచ్చే 10 సంవత్సరాల్లో ఇప్ప టకీలా ప్రపంచంలో మెక్సికో టకీలాను కూడా అధిగమించే అవకాశం ఉంది అని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow