మహబూబ్‌నగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై, ఒకేసారి పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాలకు ఫుల్ ట్యాంక్ నింపుకునే ప్రయత్నం చేయడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతున్నదని తెలిపారు.
జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నదని ఎస్పీ తెలిపారు. ఇంధన కొరతకు సంబంధించిన ఎలాంటి పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్య సమాచారం, వదంతులను నమ్మవద్దని, నిర్ధారణ చేయని సమాచారాన్ని ఇతరులకు పంపించడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ అవసరాల మేరకే ఇంధనాన్ని వినియోగించుకోవాలని, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని కోరారు.
