జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా:
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని కావరమ్మపేట జాతీయ రహదారిపై సోమవారం ఆశా వర్కర్లు భారీ ఆందోళన చేపట్టారు. గత ఆరు నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
గంటకు పైగా సాగిన ఈ ధర్నా కారణంగా హైదరాబాద్–కర్నూలు జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. హైవేపై సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు
“మా జీతాలు మాకు ఇవ్వాలి.. సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా జీతాలు లేక తమ కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వేతనాలు ఆపడం అన్యాయమని వారు ప్రశ్నించారు.
ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆశా వర్కర్లను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని మహిళలు రోడ్డుపైనే భీష్మించుకుని కూర్చున్నారు.
మహిళల పట్టుదలతో పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. అనంతరం సిఐటియు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాస్తారోకో విరమించారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని తమ పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.