తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు అలర్ట్

Telangana Weather Rain Alert

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎండలు, వర్షాలు కలిసి భిన్నమైన వాతావరణాన్ని సృష్టించాయి.

మరో కొన్ని గంటల్లో హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇబ్రహీంపట్నం, బి.ఎన్.రెడ్డి నగర్, మీర్‌పేట్, బాలాపూర్, చంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.

మార్చి 31న ఉదయం నుంచే కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజాంబాద్, కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పగటిపూట కూడా చీకట్లు అలుముకున్నాయి.

రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని, కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడే ప్రమాదం ఉందన్నారు.

ఈ అకాల వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి పంట ఈదురు గాలుల వల్ల నేలపాలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సహాయం చేయాలని వారు కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow