రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ కోసం కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇంటర్‌బోర్డు దృష్టికి..
ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నా.. వాటిని ఆఫ్ చేసి ట్యాంపరింగ్ చేసి మాస్ కాపియింగ్‌కు తెరలేపారు. జూబ్లీహిల్స్ రెసోనెన్స్, మలక్‌పేట ఎంఎస్, షాహీన్, కూకట్‌పల్లిలోని 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లోనే మాస్ కాపీయింగ్ జరిగినట్లు వెల్లడైంది. ప్రయోగ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా ఈ భాగోతాన్ని నుడపుతున్నాయి. ఇన్విజిలేటర్లతో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు కాపీలు అందిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 4.07 లక్షల మంది ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నారు. ప్రాక్టికల్స్ కోసం పలు ప్రైవేట్ కళాశాలలు ఒక్కో విద్యార్థి కోసం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేసి ఎగ్జామినర్లకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఆయా పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. ఆయా పరీక్ష కేంద్రాల్లో విధుల్లోని ఎగ్జామినర్లు, ఇతర ల్యాబ్ సిబ్బందిపైనే చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు.