Revanth Reddy: నీళ్లలో అన్యాయం.. నిధుల దోపిడీ


 కేసీఆర్‌ హయాంలో పాలమూరు-రంగారెడ్డిలో భారీ అవినీతి 

విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు
భారాసను బతికించుకునేందుకు తెరపైకి నీటి సెంటిమెంట్‌
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణాజలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి 

నీళ్ల విషయంలో కేసీఆర్, హరీశ్‌రావు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి విచారణకు ఆదేశిస్తారన్న సమాచారం ఉప్పందడంతో పక్కన పెట్టిన బనకచర్ల, నల్లమలసాగర్, గోదావరి ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారు.

‘‘నీళ్ల వెనకాల రాజకీయం ఉంది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోతూ వస్తుండడంతో భారాస మనుగడ కష్టమవుతుందనే ఆ పార్టీ నేతలు జలవివాదం తీసుకొస్తున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు అసత్యాలతో అపోహలు సృష్టిస్తున్నారు. ఏపీకి రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారన్న అపోహ ద్వారా పార్టీని బతికించాలని అబద్ధాలు చెబుతున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కేంద్రం వద్ద ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా నదిలో నీటి కేటాయింపుల పత్రంపై నాడు కేసీఆర్‌ చేసిన సంతకంతో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్, హరీశ్‌రావులు తెలంగాణను అచేతనావస్థలోకి నెట్టేసి... ఏపీ వారిని బలవంతుల్ని చేశారని ఆరోపించారు. ప్రజాభవన్‌లో గురువారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నీటికి తెలంగాణలో తల అయిన జూరాల దగ్గర వదిలేసి తోకలాంటి శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునేలా నాడు భారాస పాలకులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్‌ చేయడంతో నీటి విషయంలో అన్యాయం, నిధుల దోపిడీ జరిగిందన్నారు. ‘తలదగ్గర ఒడిసి పట్టుకుంటే ఏపీకి చుక్కనీరు వెళ్లే అవకాశం ఉండేది కాదు. 

వచ్చినవి వచ్చినట్లు తీసుకుంటే జగన్, చంద్రబాబు ఎవరికి చెప్పుకొనేవారు? తెలంగాణ గడ్డపైకి వచ్చి ఆపేవారా? మనం చెంబుడు నీళ్లు తీసుకునేలోపు.. ఏపీ బిందెలకు బిందెలు తీసుకెళ్లే అవకాశమిచ్చారు’ అని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగిందని, జూరాల నుంచి మారడంతో ప్రాజెక్టు వ్యయ అంచనాలు పెరిగాయి తప్ప.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని తెలిపారు. ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చినపుడు మంత్రి మండలి అనుమతి తీసుకోలేదు. ప్రాజెక్టు కట్టే స్థలం పేరు మారింది.. అంచనాలు మారాయి. ఇక్కడే భారీ అవినీతికి పునాదులు పడ్డాయి. రూ.వేల కోట్లు, కమీషన్లు ఎవరింటికి వెళ్లాయి’ అని ప్రశ్నించారు. గత 25 ఏళ్లుగా కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ అబద్ధాలతో బతుకుతున్నారని, భారాసను బతికించుకునేందుకు నీటి సెంటిమెంట్‌ను ముందుకు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. తాము భారాస హయాంలో జరిగిన అన్యాయాన్ని, పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. శాసనసభలో బలమైన వాదనలు వినిపిద్దామని, ఎవరినీ కించపరచవద్దని సూచించారు. శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావద్దని, నూరుశాతం హాజరు ఉండాలని స్పష్టం చేశారు. 

‘‘కేంద్రం వద్ద జరిగిన హైపవర్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రిగా హరీశ్‌రావు తెలంగాణకు 34శాతం(299 టీఎంసీలు), ఏపీకి 66శాతం(512 టీఎంసీలు) వాటాకు అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నారు. ట్రైబ్యునల్‌ కేటాయింపులు చేసే వరకు ఇదే విధంగా వాడుకుంటామంటూ 2020లో సంతకాలు చేశారు. ఆ విధంగా శాశ్వతంగా తెలంగాణకు నష్టం చేశారు. ఏపీ 512 టీఎంసీలు వాడుకునేందుకు శాశ్వతహక్కు కల్పించారు. 21 ఏళ్లు గడుస్తున్నా నీటి కేటాయింపులపై తీర్పు రాలేదు. ఎన్నేళ్లకు వస్తుందో తెలియదు. తీర్పువచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పడంతో ఏపీకి అలుసుగా మారింది. అంతర్జాతీయ జలవిధానం ప్రకారం పరీవాహకప్రాంత ప్రకారం నదీజలాల కేటాయింపు చేయాలి. ఈ లెక్కన తెలంగాణకు 71శాతం.. ఏపీకి 29 శాతం కేటాయింపులు ఉండాలి. ఆ ప్రకారం తెలంగాణకు 555 టీఎంసీలు కావాలని అప్పట్లో వాదించలేదు. కృష్ణానదిలో నీటిలభ్యత 1,005 టీఎంసీలు అని చెప్పినందున.. తెలంగాణకు 763 టీఎంసీలు, ఏపీకి 287 టీఎంసీలు ఇవ్వాలని మేం స్పష్టం చేశాం. ఈ దెబ్బతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అయింది. ఏపీ ప్రతిపక్షనేత జగన్‌.. ఇటీవల చంద్రబాబుకు లేఖరాసి తెలంగాణ సమర్థంగా వాదన వినిపిస్తోందన్నారు. ఏపీ సరిగా ఎదుర్కోవడం లేదని చెప్పారు.  తెలంగాణ హక్కులు సాధించుకోకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి తయారు చేసిన పేపర్‌పై కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు పెట్టారు.

మరో రూ.84 వేల కోట్లు ఖర్చు చేసినా పూర్తవుతుందన్న ఆశల్లేవ్‌

గోదావరి బేసిన్‌లో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి రూ.38,500 కోట్ల అంచనాను రూ.1.5లక్షల కోట్లకు పెంచినట్లే... పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. మూడు స్టేజీలకు బదులు ఐదు.. 22 పంపులకు బదులు 37 పంపులు చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి తరలించి రూ.32,200 కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు మరో రూ.84 వేల కోట్లు ఖర్చు చేసినా పూర్తవుతుందన్న ఆశల్లేవు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు అని ఏపీ కేసు వేసింది. నది నీటిని బేసిన్‌ లోపల వాడుకోవాలి. అవతలికి తరలించకూడదు. కానీ ఏపీ ప్రభుత్వం కృష్ణాబేసిన్‌ నీటిని పెన్నా బేసిన్‌కు తరలిస్తోంది. దీన్ని నిలిపివేయాలని కేసీఆర్‌ నాడు వాదించలేదు. 

దోపిడీ తెలుస్తుందనే నాడు డీపీఆర్‌ సిద్ధం చేయలేదు..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి నాటి పాలకులు 2023 వరకు డీపీఆర్‌ సిద్ధం చేయలేదు. ఎందుకంటే అంచనాలు రూ.78 వేల కోట్లకు పెరిగిన విషయం ప్రజలకు తెలుస్తుందని... లిఫ్టుల పేరిట దోపిడీ బయటకు వస్తుందని. 2019లో బహిరంగ విచారణ చేయలేదు. సుప్రీంకోర్టు ముందు సాగునీటి ప్రాజెక్టు కాదు. తాగునీటి ప్రాజెక్టు అని చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు 7.15 టీఎంసీల మేరకే పనులు చేయాలని, వ్యవసాయ వినియోగానికి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పింది. దీంతో వేల కోట్లు ఖర్చుచేసిన ప్రాజెక్టు నిలిచిపోయింది. కేవలం కాంట్రాక్టు కమీషన్ల కోసం తాగునీటి ప్రాజెక్టుగా చిత్రీకరించారు. 

ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ముందుకు వెళ్తున్నాం

చిన్న నీటి వనరుల్లో ఆదా కారణంగా 45 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు 80 టీఎంసీల తరలింపు నేపథ్యంలో 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ వేశాం. ప్రధాని కృషి సించాయీ యోజన కింద అనుమతిస్తే కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని, సహాయం చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరాం. పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు ఉంటేనే చేస్తామని చెప్పారు. అందుకే చెరువులు, కుంటల డేటాను క్లస్టర్ల వారీగా ఇస్తామని చెప్పాం. రూ.84 వేల కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 60శాతం నిధులిస్తే తద్వారా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ముందుకు వెళ్తున్నాం. అనుమతులు ఉంటే ప్రాజెక్టుకు 7.5 శాతం వడ్డీతో 30-40 ఏళ్ల కాలపరిమితితో టర్మ్‌ లోన్లు వస్తాయి. తొలివిడతలో 45 టీఎంసీలు, మరో విడతలో 45 టీఎంసీలతో బలమైన వాదనతో ముందుకు వెళ్తున్నాం.  

శాసనసభలో చర్చకు వచ్చేందుకు జంకుతున్నారు

భారాస హయాంలో నీటి అన్యాయం, నిధుల దోపిడీ జరిగింది. అందుకే శాసనసభలో చర్చకు హాజరయ్యేందుకు జంకుతున్నారు. చర్చలో ప్రతి కాగితాన్ని సభ ముందు పెడతాం. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయం, దోపిడీపై విచారణ చేయించేందుకు టీవోఆర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించా. అందుకే కృష్ణా నదిపై చర్చను వదిలేసి.. హరీశ్‌రావు బనకచర్ల, నల్లమల, గోదావరి ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారు. 

ఆయన తెలంగాణ ప్రాజెక్టులపై అవగాహన కలిగిన అధికారి

ఆదిత్యానాథ్‌ దాస్‌ ఉమ్మడి రాష్ట్రంలో 2007 నుంచి 2014 వరకు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులపై అవగాహన ఉన్నందునే సలహాదారుగా నియమించాం. ఆయన ఏపీ కాదు.. తెలంగాణకాదు.. బిహార్‌కు చెందిన వ్యక్తి. ఆయన ఎవరికీ చుట్టం కాదు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన్ను తొలగిస్తే తాము చేసిన దొంగతనం బయట పడకుండా ఉంటుందని హరీశ్‌రావు ఆరోపణలు చేస్తున్నారు’’ అని  రేవంత్‌రెడ్డి అన్నారు.


కేసీఆర్‌ దయచేసి రండి...

‘‘కేసీఆర్‌.. దయచేసి శాసనసభకు రావాలి. మంచి వాతావరణంలో చర్చ చేద్దాం. నీటిహక్కులు కాపాడేందుకు మాకేం భేషజాలు లేవు. మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడిగా మీరిచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటాం. మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. సభా నాయకుడిగా మాటిస్తున్నా. ఒకవేళ సభకు రాకుంటే ప్రతిపక్ష నా¦యకుడిగా సూచనలు చేయాలి. లేఖ రాయాలి. ఎలా ముందుకు వెళ్దామో చెప్పాలి. ఇప్పటికే ప్రాజెక్టుకు అన్యాయం జరిగింది. ఏదోరకంగా శక్తిని కూడదీసుకొని ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ముందుకెళ్తోంది’’ అని సీఎం అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow