Rangareddy District: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్షాకోట్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల వేదాంత్ రెడ్డి అనే బాలుడిపై నాలుగు వీధి కుక్కలు గుంపుగా ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. కుక్కలు వదలకుండా అతడిని కిందకు పడేసి శరీరంపై విచక్షణా రహితంగా కరిచాయి. కుక్కల దాడిలో వేదాంత్ రెడ్డి తల, మెడ, శరీర భాగాలపై తీవ్రమైన గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను వెళ్లగొట్టారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉంచి బాలుడికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో శాంతినగర్ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కుక్కల దాడులు జరిగినట్లు స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. వీధి కుక్కల బెడదను అరికట్టడంలో వారు విఫలమయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను బయటకు పంపాలంటేనే భయం వేస్తోందని.. తక్షణమే అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి తమను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags
Hyderabad