auni amavasya | పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య. దీనికి ఆ పేరు రావడానికి ఓ కారణం ఉంది. పుణ్యప్రదమైన ఉత్తరాయణ కాలం తర్వాత వచ్చే ఆ రోజున ఉపాసకులు, యతిపుంగవులు, సాధువులు తదితర సాధకులు మౌనంగా వారి వారి సాధనను కొనసాగిస్తారు. ఉత్తర భారతంలో మౌనవ్రతం చేసే సంప్రదాయం ఉంది. అందువల్ల మౌనవ్రతానికి సంకేతంగా దీన్ని ‘మౌని అమావాస్య’ అని పిలుస్తారు. తపస్సిద్ధిని పొందిన వారిని ‘మౌని’ అంటారు. తపస్సు అనగా ‘తప ఆలోచన’ అని అర్థం. అంటే.. సంకల్పించిన విషయం మీద తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండడం. ఆ రోజు సముద్ర స్నానం చేస్తే మంచిది. త్రివేణి సంగమ స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదం. గోదావరిలో స్నానం కూడా పరమ శుభదాయకం.
చొల్లంగితో ముగిసే సప్తసాగర యాత్ర
గౌతముని తపః ఫలంగా ఏర్పడిన గోదావరీ జలాలను ఏడుగురు రుషులు ఏడుపాయలుగా తీసుకువెళ్లి ఏడు స్థలాల్లో సముద్రంలో సంగమించినట్లు చేశారు. గౌతముడు తీసుకువెళ్లిన శాఖకు గౌతమి అనే పేరు స్థిరపడింది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే ఆరుగురు రుషులు తీసుకెళ్లిన శాఖలు వారి వారి పేర్లతో ఖ్యాతి పొందాయి. తుల్యుడు తీసుకెళ్లిన శాఖ తుల్యభాగ అనే పేరుతో చొల్లంగి అనే ఊరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ ఏడు సాగర సంగమాలను ఉభయగోదావరి ప్రజలు అతి పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడు స్థలాలకు వెళ్లి స్నానం ఆచరించడాన్ని గోదావరి మండలాల్లో సప్త సాగర యాత్ర అంటారు. ఇలా చేయడం వల్ల ఏడు సముద్రాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం అని విశ్వసిస్తారు. ఒక్కో ప్రదేశంలో స్నానం వల్ల ఒక్కో ప్రయోజనంతో పాటు జ్ఞాతాజ్ఞాతాది (తెలిసీ తెలీక చేసిన) పాపాలు తొలగుతాయనే విశ్వాసం ఉంది. ఈ సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి వద్ద గోదావరి సంగమ స్నానంతో పూర్తవుతుంది. కనుక ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు.
సూర్యానుగ్రహం
ఈ సంవత్సరం జనవరి 18వ తేదీన అమావాస్య ఆదివారం నాడు రావడం మరింత విశేషం. సాధారణంగా అమావాస్యనాడు సూర్యుడు చాలా బలంగా ఉంటాడు. సూర్య గమనం భూమికి చేరువలో సాగుతుంది. భాస్కరుడు అధిష్ఠానంగా ఉన్న ఆదివారం నాడు ఈ అమావాస్య రావడం సాధకులకు మరింత శక్తిని ఇస్తుంది. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య నాడు సముద్ర స్నానం లేక త్రివేణి సంగమ లేదా గోదావరి వంటి ఏదైనా జీవనదీ స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేసి ఎర్రని పువ్వులు, ఎర్ర చందనంతో అర్చన జరిపించాలి. దీనివల్ల గ్రహనాయకుడైన సూర్య భగవానుని అనుగ్రహం కలగడంతో పాటు కుజ, రాహుకేతు గ్రహదోషాలు తొలగి ఆరోగ్య ప్రదాయకుడు, ఆత్మ కారకుడైన సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతాయి. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఈ మౌని అమావాస్య నాడు బ్రహ్మీ ముహూర్తంలో, అదేవిధంగా సూర్యోదయానికి ముందు సూర్యోదయం అయిన తరువాత 90 నిమిషాల్లోపు స్నానం చేయడం పుణ్యప్రదం.
పితృ కార్యాలు..
అమావాస్య పితృ పర్వం కూడా కాబట్టి.. పితృ శాపాలు, జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు అన్నదానం, లవణ దానం, పెరుగు దానం, గుమ్మడికాయ దానాలు పితృదేవతల అనుగ్రహాన్ని అందించడంతో పాటు ఆయా దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ మౌని అమావాస్యనాడు యోగ్యుడైన బ్రాహ్మణునికి పితృ ప్రీతిగా బూడిద గుమ్మడికాయను దానం చేయడం వల్ల గుమ్మడికాయ బరువంత బంగారం దానం చేసిన ప్రయోజనం లభిస్తుందని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఏదైనా కారణంతో సంక్రాంతి నాడు ఆచరించవలసిన దానాలు, సంక్రమణ దిన విధులు ఆచరించలేని వారు ఈ మౌని అమావాస్యనాడు చేయడం వల్ల విశేష ఫలితాన్ని పొందుతారు.
ఈ మౌని అమావాస్య నాడు సూర్యారాధనతో పాటు కాలభైరవ ఆరాధన, వీరభద్ర ఆరాధన, మహాకాళి వంటి ఉగ్రదేవతల ఆరాధన విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కాలభైరవుడిని సందర్శించి ఆయనకు 21 లేక 27 లేక 36 మినప గారెల మాలను సమర్పించి బూడిద గుమ్మడి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ సమస్యలూ తొలగుతాయి. మనోభీతి, మానసిక అశాంతి వంటి సమస్యలతో పాటు పిల్లలలో వచ్చే వాక్ సంబంధ (నత్తి, మూగ) సమస్యలు, మానసిక ఎదుగుదల లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నవారు వీరభద్ర స్వామిని దర్శించి బిల్వదళాలతో అర్చన జరిపించి భద్రకాళి అమ్మవారికి 21 లేక 54 లేదా 108 సంఖ్య నిమ్మకాయలతో గుచ్చిన దండను సమర్పించినట్లయితే ఆయా సమస్యలతో పాటు భూత బాధలు, దుష్ట గ్రహ బాధలు, నరఘోష వంటి దోషాలు నివృత్తి అవుతాయి. ఆదివారం అమావాస్య రోజున ప్రదోష సమయంలో ముళ్లతో ఉండే గారమండను (గార చెట్టు కొమ్మ) పసుపు కుంకుమలతో పూజించి సాంబ్రాణి ధూపం వేసి ప్రధాన గుమ్మానికి కట్టి ఉంచడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి.