బంగారం విలువ రోజు రోజుకు ఎలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏళ్లు పెరిగే కొద్ది దాని వాల్యూ పెరుగుతుందే గానీ తరగదు. అందుకే, చాలామంది బంగారంపైనే పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని దేశాల్లో ముడి బంగారం కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు. దాన్ని మార్కెట్లో విక్రయిస్తే బోలెడన్ని డబ్బులు వస్తాయి. కొన్నాళ్ల కిందట ఓ పరిశోధకుడు ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని గోల్డ్ ఫీల్డ్స్‌లో తిరుగుతున్నప్పుడు ఒక చిత్రమైన రాయి కనిపించింది. తుప్పు పట్టిన ఇనుములా ఉన్న ఆ రాతిని బంగారం అనుకున్నాడు. ఎవరికి చెప్పకుండా దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అలా కొన్నాళ్లు దాచుకున్నాడు.. చివరికి అదేమిటో తెలియక మెల్‌బోర్న్ మ్యూజియానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అప్పుడే ఓ అద్భుతం బయటపడింది. అది సాధారణ రాయి కాదని తేలింది.
ఆ రాయి ఎలా దొరికింది?
డెవిడ్ హాలే అనే పరిశోధకుడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరానికి 160 కిమీల దూరంలో ఉన్న మేరీబరో రీజనల్ పార్క్‌లో బంగారు నిక్షేపాల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆ రాయి దొరికింది. 17 కేజీల బరువున్న ఆ రాయి.. తుప్పు రంగులో చాలా నున్నగా ఉంది. అది బంగారం కావచ్చని భావించాడు. కానీ.. దాన్ని పగలగొట్టడం కూడా సాధ్యం కాలేదు. సుత్తి, డ్రిల్లర్.. ఇలా అన్నిరకాల పరికరాలను ప్రయత్నించాడు. కానీ, అది పగల్లేదు. అలా కొన్నేళ్లు ఆ రాయితో కుస్తీలు పడ్డాడు. ఆ తర్వాత దాన్ని మెల్‌బోర్న్ మ్యూజియంకు తీసుకెళ్లాడు. అక్కడ వారు డైమండ్ సా(diamond saw)తో దాని కట్ చేసి పరిశీలించగా.. అసలు సంగతి బయటపడింది.
అది సాధారణ రాయి కాదు.. ఉల్క
డెవిడ్ హాలేకి దొరికిన రాయి అసలు భూమికి సంబంధించిందే కాదని, అది ఒక ఉల్క అని తెలుసుకున్నారు. అంతేకాదు మేరీబరో ప్రాంతంలో ఇప్పటివరకు కనుగొన్న అరుదైన ఉల్కల్లో ఇది కూడా ఒకటి. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నిధుల కోసం భారీగా అన్వేషణలు జరిగేవి. చాలామంది పరిశోధకులు ఈ నేల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించారు. అయితే, ఇప్పటివరకు వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే, హాలే తెచ్చిన ఉల్కతో కొత్త విషయాలు బయటపడ్డాయి.
ఈ ఉల్క ప్రత్యేకత ఏమిటీ?
పాపం బంగారం అనుకొని ఆశపడిన హాలేకి పైసా కూడా దక్కలేదు. అయితే, తనకు దక్కిన రాయి చాలా అరుదైనదనే సంతోషం మాత్రమే మిగిలింది. హాలే తర్వాత ఆ రాయి.. మెల్‌బోర్న్ మ్యూజియంలోని జియోలజిస్టులు డెర్మోట్ హెన్రీ, బిల్ బిర్క్ చేతిలో పడింది. వారు కూడా దాని మిస్టరీని ఛేదించడం కోసం ఎన్నో రోజులు శ్రమించారు. అసలు అది అంత బలంగా ఎలా ఉంది, ఆ రాతి నిర్మాణం ఎలా జరిగిందనే విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఆ ఉల్క అంతరిక్షం నుంచి భూమిపై పడే సమయంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలకు గురైందని, కింద పడిన తర్వాత చల్లబడిందని ఆ తర్వాత ఇక్కడి వాతావరణం దాన్ని శిలలా మార్చిందని హెన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాన్ని కట్ చేసిన తర్వాత H5 ఆర్డినరీ కాండ్రైట్ అని తేలిందని తెలిపాడు. ఇది పగలకపోవడానికి కారణం.. అందులో అధికశాతం ఉన్న ఇనుము, కాండ్రూల్స్ అని పేర్కొన్నాడు.
భూమి కంటే ముందే పుట్టిందా?
కాండ్రూల్స్ అంటే.. సౌరవ్యవస్థ ఆవిర్భావ సమయంలో ఏర్పడిన బిందువు. అదే కాలక్రమేనా ద్రవరూపం నుంచి ఉల్కగా మారి.. భూమిపై పడి శిలగా మారి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది చాలా ప్రాచీన ఉల్క కావచ్చని అంచనా. భూమి ఏర్పటానికి ముందే సౌర వ్యవస్థలో ఇది పుట్టి ఉండటుందని, భూమి ఏర్పడిన తర్వాత.. అది అక్కడ పడి ఉండవచ్చని అనుకుంటున్నారు. దీని ఆధారంగా సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకొనే అవకాశాలున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. 4.6 బిలియన్ ఏళ్ల కిందట ఈ ఉల్క ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే దీనికి మ్యూజియంలోని విక్టోరియా కలెక్షన్స్‌లో ప్రత్యేక స్థానం కల్పించారు. 2003లో కూడా మేరీబరోలో ఇలాంటి ఉల్కే కనిపించింది. దాని బరువు 55 కిలోగ్రాములు. ఇప్పటివరకు లభించిన ఉల్కల్లో ఇదే అత్యంత బరువైనది. డెవిడ్ హాలేకి లభించిన 17 కిలోల బరువున్న ఉల్క దాని తర్వాతి స్థానంలో ఉంది.