నంచర్ల గురుకుల పాఠశాలలో అస్వస్థత ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ


 

మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన పై కలెక్టర్ విజయేందిర బోయి స్పందించారు.


మహమ్మదాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన పై కలెక్టర్ విజయేందిర బోయి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకున్న కలెక్టర్, వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సునీత, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త వాణిశ్రీ మంగళవారం నంచర్ల గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని వంటశాల, డార్మిటరీలు, వాష్‌రూమ్‌లు, వెల్నెస్ సెంటర్‌ను పరిశీలించి పరిశుభ్రత, సౌకర్యాలపై వివరాలు సేకరించారు. అలాగే విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిని వెంటనే మహమ్మదాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ఇంజెక్షన్లు, సెలైన్ ద్వారా చికిత్స అందించామని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీత తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండబోదని, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow