మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం…
విధులకు వెళ్తున్న కార్మికులపై ప్రమాద ఛాయలు…
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సేజ్ సమీపంలో శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధుల్లో చేరేందుకు ఆటోలో ప్రయాణిస్తున్న కార్మికులను వెనుక నుంచి పోలేపల్లి యూగ్లా కంపెనీకి చెందిన ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కార్మికులు గాయపడ్డారు. వీరంతా పోలేపల్లి సేజ్‌లోని సుప్రీం పైప్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్‌తో పాటు కంపెనీ అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఘటన స్థలానికి చేరుకున్న జడ్చర్ల పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక ఇతర సాంకేతిక లోపాలున్నాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదాల నివారణకు పరిశ్రమల పరిసరాల్లో వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
జడ్చర్ల నుంచి – జెసిఎల్ న్యూస్ టీవీ.