ఈ విగ్రహం త్రిమూర్తులకు ప్రతీక- 1.5 మీటర్ల ఎత్తులో రాతిపై చెక్కి ఉంటుంది- ప్రతీ 60 సంవత్సరాలకోసారి జరిగే అద్భుతం ఏంటో తెలుసా?
Sri Parashurameshwara Swamy Temple : దేశంలో అతి ప్రాచీన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయాల వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలు ఈనాటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. హిందూ ధర్మ చరిత్రలో అత్యంత పురాతనమైన శివాలయాల్లో ఒకటిగా విశేష ఖ్యాతి పొందిన గుడిమల్లంలో ప్రపంచంలోనే అరుదైన శివ స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. ఈ గుడి మల్లం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
గుడి మల్లం ఎక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలంలో చిన్న గ్రామం గుడిమల్లం. పవిత్ర స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం వలన ఈ క్షేత్రం శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తిరుపతి నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లంలోని శివ లింగం ప్రపంచంలోనే అతి పురాతన శివలింగంగా వెలుగొందుతోంది.
గుడి మల్లం శివలింగం ప్రపంచంలో ఇప్పటికే ఉనికిలో ఉన్న అతి పురాతన శివలింగాల్లో ఒకటిగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ ఆలయం 1 నుంచి 3 వ శతాబ్దానికి మధ్య కాలం నాటి ప్రాచీన ఆలయంగా పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. అంటే ఈ ఆలయం దాదాపు 2300 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగి ఉండటం గొప్ప విశేషం.
స్థల పురాణం
జమదగ్ని కుమారుడైన పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించి, తన తండ్రి ఇచ్చిన వరప్రభావంతో ఆమెను తిరిగి బ్రతికించుకున్నాడు. ఈ క్రమంలో తల్లిని సంహరించిన పాపపరిహారం కోసం పరశురాముడు అనేక యజ్ఞయాగాదులు చేసాడు ఎన్నో శివలింగాలను ప్రతిష్టించాడు. ఈ కోవలోకి చెందినదే గుడిమల్లంలోని శివ లింగం. ఇక్కడ ప్రతిష్టించి ఉన్న శివలింగం సాధారణ లింగం కాదు. సుమారు 1.5 మీటర్ల ఎత్తుతో, మెరుగుపెట్టిన రాతిపై చెక్కిన ఉంటుంది. లింగం ముందు భాగంలో శివుడు పరిపూర్ణ మానవాకారంలో నిలువెత్తుగా దర్శనమిస్తాడు. ఊర్ధ్వ లింగ స్వరూపంలో వెలసిన శివుని పాదాల వద్ద అపస్మారుడు ఉండగా, ఒక చేతిలో పరశువు అంటే గొడ్డలి, మరో చేతిలో పొట్టేలు, జటాజూటం, గంభీరమైన దృక్కులతో వెలసి ఉన్న శివలింగాన్ని వర్ణించాలంటే మాటలు సరిపోవు.
ఈ శివలింగాన్ని త్రిమూర్తుల ప్రతీకగా కూడా భావిస్తారు. విగ్రహం క్రింద భాగంలో బ్రహ్మ మధ్యలో పరశురామావతారం లో ఉన్న విష్ణువు, పైభాగంలో శివుడు ఉండడం వలన ఈ విగ్రహం త్రిమూర్తులకు ప్రతీకగా కూడా భావిస్తారు. గుడిమల్లం దేవాలయ గర్భగుడి గుర్రపు నాళం ఆకారంలో నిర్మించి ఉంది. ఈ నిర్మాణ శైలి భారతదేశంలో కేవలం కొన్ని పురాతన దేవాలయాల్లో మాత్రమే కనిపిస్తుంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించి ద్రావిడ శైలిని జోడించారు. ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది.
అరవై ఏళ్లకోసారి అద్భుతం
గుడిమల్లంలో అద్భుతమైన విశేషం ఏమిటంటే, ఇక్కడ ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది నీరు గర్భగుడిని ముంచెత్తడం. 2005 లో ఇలాగే జరిగింది. తిరిగి ఈ అద్భుతం 2065 లో ఆవిష్కరించనుంది. గుడిమల్లం ఆలయ ప్రాంగణంలో పార్వతీదేవి ఆనందవల్లి అమ్మవారుగా భక్తులను అనుగ్రహిస్తుంది. అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సూర్య నారాయణ మూర్తి వంటి ఇతర ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు.
పూజోత్సవాలు
గుడిమల్లంలో గతంలో కంటే ప్రస్తుతం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం వెలుగులోకి రావడం వలన అత్యధికమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారు. మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా జరిగే జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ఇక కార్తీక మాసం మొత్తం ఆలయం దీపాల శోభతో కళకళలాడుతుంటుంది.
తిరుపతికి అతి సమీపంలో చరిత్ర, పురాణం, ఆధ్యాత్మికత అన్నీ ఒకేచోట మిళితమైన ఈ గుడి మల్లం క్షేత్రాన్ని మనం కూడా తప్పకుండా దర్శిద్దాం తరిద్దాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.