Top 20 News: కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్, అల్లుడు సహాయంతో భర్తను చంపిన భార్య

 




1. భర్తే కాలయముడు!

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడిగా మారి, తన తల్లిదండ్రులతో కలిసి భార్యను హత్యచేశారు. మొదటి నుంచి ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీనికి తోడు అదనపు కట్నం తేవాలంటూ వారు అనూషను తరచూ వేధింపులకు గురిచేసేవారు.

2. అభివృద్ధికి ప్రణాళికలు

భారీ వర్షాల వల్ల తలెత్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని.. ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగవంతం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుతో పాటు గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రాత్రి వేళల్లో హన్మకొండ నుంచి అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.


3. ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ స్కూటీ ఢీ.. ఒకరు మృతి

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ స్కూటీని ఢీకొట్టగా, అదే లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనుక ఉన్న స్కూల్ బస్సు కూడా లారీని ఢీకొనడంతో.. విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

4. పేద విద్యార్థుల కోసం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని మాజీ మంత్రి అంబటి అన్నారు. కోటి నాలుగు లక్షల మందితో ఈ సంతకాల ప్రతులను గవర్నర్‌ను కలిసి ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మెడికల్ విద్య పేద విద్యార్థులకు దూరం అవుతుందనే వైసీపీ పోరాటం చేస్తోందని అంబటి అన్నారు.


5. కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తన మాటలను వక్రీకరించి తాను అనని మాటలను అన్నట్లుగా కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లను నేను చంపేస్తానని బెదిరించానని కేటీఆర్ అంటున్నారని మండిపడ్డారు.



6. అల్లుడు సహాయంతో భర్తను చంపిన భార్య

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పౌర్ణమి.. అల్లుడు లింగమయ్య సహాయంతో భర్త చాకలి గుర్రప్పను హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి ఏఎస్పీ మంద జావలి వెళ్లి పరిశీలించారు.

7. కార్మికుల ఆందోళన

నెల్లూరు మున్సిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనకారుల వల్ల విధులకు ఆటంకం కలగడంతో పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు.

8. వామ్మో నాగుపాము!

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలోని ఓ ఇంట్లో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ఇంటి పైకప్పులో పామును చూసిన కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. చాకచక్యంగా నాగుపామును బంధించిన స్నేక్ క్యాచర్.. సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.

9. బాధితుల హర్షం

తెలంగాణ పోలీసులకు ధన్వంతరి బాధితులు కృతజ్ఞతలు చెప్పారు. CCS బోర్డుకు బాధితులు పాలాభిషేకం చేశారు. రెండేళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ సీనియర్ సిటిజన్లను మోసం చేసింది.

10. పీఎస్‌కు తరలింపు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట హైవేపై ఐదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మరణానికి కారణమైన ఏఎస్సై కుమారుడు వెంకట నాయుడు గ్యాంగ్‌ను పోలీసులు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నరసరావుపేట సబ్ జైలు నుంచి ఐదుగురు నిందితులను ఎస్కార్ట్ సహాయంతో పోలీసులు తీసుకొచ్చారు. కోర్టు అనుమతితో డీఎస్పీ హనుమంతరావు బృందం ఈ నెల 22వ తేదీ వరకు వీరిని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.

11. బెజవాడలో గంజాయి బ్యాచ్ హల్ చల్

విజయవాడ నగరంలో గంజాయి బ్యాచ్‌లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. తాజాగా అజిత్ సింగ్ నగర్‌లో గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. ఒక మహిళ నివసిస్తున్న ఇంట్లోకి చొరబడిన దుండగులు, ఆమె కుమారుడిపై కారం చల్లి క్రికెట్ బ్యాట్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

12. అదే పరిస్థితి

జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘటనలతో గ్రామంలో భారీగా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామానికి వచ్చి తమ సమస్యను వినాలని నిరసనకారులు భీష్మించుకు కూర్చున్నారు.

13. నిందితుడు అరెస్ట్

కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 11న జరిగిన వల్లెపు వెంకటయ్యను.. మద్యం మత్తులో నిందితులు హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. వారిలో ఒకరు మైనర్ కావడం గమనార్హం. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

14. తప్పుడు ప్రచారం

మంచిర్యాల జిల్లా నస్పూర్ సీసీసీ టౌన్‌షిప్‌లో పులి సంచరిస్తున్నట్లు జరిగిన ప్రచారం నకిలీదని అటవీ అధికారులు తేల్చారు. సాయికిరణ్ అనే వ్యక్తి AI ద్వారా పులి ఫోటోను సృష్టించి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ శివ్ ఆసీస్ సింగ్ హెచ్చరించారు.

15. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ఉద్రిక్తత

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ AISF, ప్రజా సంఘాలు అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. విద్యార్థులు, మహిళలు కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

16. పంచాయతీ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే ఫైర్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పంచాయతీ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరికరాల పంపిణీలో ఆలస్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని నిరసిస్తూ ఆయన కార్యక్రమాన్ని బహిష్కరించారు. పంచాయతీలకు పరికరాలు అందిస్తేనే తిరిగి వస్తానని స్పష్టం చేశారు.

17. మోడీకి తమిళనాడు సీఎం కీలక విజ్ఞప్తి

ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక విజ్ఞప్తి చేశారు. భారత ఎగుమతి ఆర్థిక వ్యవస్థకు తమిళనాడు వెన్నెముక వంటిదని ట్వీట్ చేశారు. అమెరికా విధించిన శిక్షాత్మక సుంకాల వల్ల రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్డర్లు, కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తయారీ రంగాన్ని రక్షించేందుకు తక్షణమే ద్వైపాక్షిక పరిష్కారం కనుగొనాలని కోరారు.

18. కోలుకున్నాం..!

ఇటీవలి సంక్షోభం నుంచి కోలుకుని విమాన సర్వీసులు పునరుద్ధరించినట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరారు. దాదాపు 65 వేల మంది ఉద్యోగులతో అత్యున్నత భద్రతా ప్రమాణాలతో సేవలందిస్తున్నామని తెలిపారు.

19. అభిమానుల ఆగ్రహం

టీమ్‌ ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య నిన్న లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్‌ పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా స్పందించాడు. ఇకపై మ్యాచ్‌లు జరిగే వేదికల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

20. టీజర్ రిలీజ్

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీ డెకాయిట్‌. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. 2026 ఉగాదిని పురస్కరించుకుని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow