Sarpanch elections: నువ్వెంతంటే.. నువ్వెంత.. పల్లెపోరులో ప్రధాన పార్టీల అగ్రనేతల మధ్య డైలాగ్ వార్


 పంచాయతీ ఎన్నికల వేళ పల్లె రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మూడు దశల్లో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు (Sarpanch Elections) నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇంత కాలం తమ గెలుపు కోసం పాటుపడిన కార్యక్రర్తలను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలు (State Leaders) సైతం పల్లెపోరు (Village Politics) ప్రచారానికి సై అంటున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతల మధ్యమాటల ఫిరంగులు పేలుతున్నాయి. దీంతో చల్లటి చలికాలం వేళ పల్లె రాజకీయం సెగలు కక్కుతోంది.

స్టేట్ లీడర్ల బిగ్ ఫైట్:

సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరగనప్పటికీ తాము మద్దతు ఇచ్చే అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ అనుచరుల గెలుపు కోసం ఆయా పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు ప్రచారంలోకి వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) కమలపూరంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. నిన్న కమలాపురంలో ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చచ్చిపోతాం అని కొంగుపట్టి ఓట్లు అడిగితే నిజంగానే చచ్చిపోతారేమో అని మహిళలంతా కరిగిపోయి ఓట్లేస్తే ఏం చేశారో చూస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) రియాక్ట్ అయ్యారు. ఈటల రాజేందర్‌(Eatala Rajendar)ది మోసపూరిత చరిత్ర అని, ఆయన కేసీఆర్‌నే వెన్నుపోటు పొడవాలని చూశాడని మండిపడ్డారు. చివరకు హుజూరాబాద్ ప్రజలను మోసం చేసి.. గజ్వేల్‌కు వెళ్లారని అక్కడ కూడా జనం ఛీ కొడితే.. అక్కడి నుంచి మల్కాజిగిరి వెళ్లారని విమర్శించారు. ఇప్పుడు ఎక్కడా దిక్కులేక మళ్లీ కమలాపూర్ వస్తానంటున్నారని విమర్శలు గుప్పించారు.

మంత్రి వర్సెస్ మాజీ మంత్రి:

ఇక ఖమ్మంలో జిల్లా పంచాయతీ ఎన్నికల వేళ మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య రాజకీయం రంజుగా మారింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై (Tummala Nageswara Rao)మాజీ మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay Kumar) నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవకాశం కోసం పార్టీ మారిన తుమ్మల చివరకు నన్ను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఓటేసిన ప్రజల వద్దకు వచ్చే సమయం తుమ్మలకు లేదని అందుకే కొడుకును పెట్టుకుని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. నా జోలికి నా కార్యకర్తల జోలికి వస్తే బిడ్డా చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించారు. ఇక పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కుమారుడు తుమ్మల యుగంధర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాపై పువ్వాడ అజయ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఈ రెండేళ్ల పాలనలో ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టామా అని నిలదీశారు. తాను ఏ అధికారిపై ఒత్తిడి చేయలేదని అధికారం సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం కాదని ప్రజల అభివృద్ధి కోసమేనన్నారు. పువ్వాడ అజయ్ ఏ రప్పా రప్పా అయినా ఆడించుకో.. తుమ్మల ఎప్పుడు తప్పు చేయరు.. ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసన్నారు. నా తండ్రి ఖమ్మంలో అందుబాటులో లేనప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నానని తుమ్మలకు చెడ్డపేరు తెచ్చేలా ఏ పని చేయనన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది వన్ సైడ్ విక్టరీ అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow