తెలంగాణలో మరోసారి ఎన్నికల కోలాహలం కనిపించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు విడతలు సజావుగా జరిగాయి. బుధవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. సాయంత్రానికల్లా ఫలితాలు సైతం వెలువడనున్నాయి.ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటినట్లు తెలుస్తున్నది. ఈనెల 11, 14న జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీ బలపరిచిన క్యాండిడేట్స్ అని తెలుస్తుండగా..బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది.ఇక కమలం పార్టీ స్వతంత్రుల కంటే వెనుకబడినట్లు సమాచారం.
అధికార పార్టీవైపే స్వతంత్రులు..
పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు. కేవలం ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుల ఆధారంగానే అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సైతం తాము బలపరిచిన అభ్యర్థులు.. తమ పార్టీ గుర్తుల మీద కాకుండా వారికి ఈసీ కేటాయించిన సింబల్స్ మీదే పోటీ చేయాల్సి ఉంది. అందుకే ఈసారి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల కంటే స్వతంత్రులే అధికంగా పోటీ చేశారు.రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు స్వతంత్రులు షాక్ ఇచ్చారు. వారి సంఖ్య కూడా అధికంగానే ఉన్నది. అయితే, వీరంతా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
సగం కంటే ఎక్కువ సీట్లు కోల్పోయిన బీఆర్ఎస్..
గత పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రెండు పర్యాయాలు ఎదురులేదు. అప్పట్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి భారీగా సర్పంచులు ఉండేవారు. తాజా ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్ధిపేట, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండలో కొన్ని స్థానాలు మినహా ఇతర జిల్లాల్లో ఆ పార్టీ భారీగా సర్పంచ్ స్థానాలను కోల్పోయినట్లు సమాచారం. గులాబీ పార్టీ కోటలను అధికార కాంగ్రెస్, స్వతంత్రులు బద్దలు కొట్టినట్లు తెలిసింది. సుమారు 70 శాతం సిట్టింగ్ సర్పంచులను బీఆర్ఎస్ కోల్పోయినట్లు తెలుస్తుండగా.. స్వతంత్రులను వారి వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు సైతం ఫలించడంలేదని ప్రచారం జరుగుతోంది. గ్రామాల అభివృద్ధి కోసం వారంతా రేవంత్ సర్కారుకు జై కొడుతున్నట్లు తెలిసింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదలు..
నేటితో పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండగా.. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. దీంతో హైకోర్టు గత తీర్పు మేరకు 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని అధికారులు ఫైల్ సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డికి పంపినట్లు సమాచారం.బీసీ రిజర్వేషన్లపై మోసం చేసినందున పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తప్పదని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ భావించాయి. కానీ, రివర్స్‌లో ఓటర్లు ప్రతిపక్షాలకే షాక్ ఇచ్చారు. ఇదే ఊపులో స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను పూర్తిగా దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. సీఎం ఆమోదం రాగానే 25లోపు షెడ్యూల్ విడుదల చేసి 2026 జనవరిలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? లేదా హస్తం దెబ్బకు చతికిలపడుతుందా? అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.