భవిష్యత్తులో తెలంగాణ అన్ని రంగాల్లో రోల్డ్ మోడల్ కాబోతుంది : మంత్రి వాకిటి శ్రీహరి


 జడ్చర్ల : గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహణతో తెలంగాణ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల వ్యవధిలోనే విశ్వసుందరీల పోటీలు, గ్లోబల్ సమ్మిట్‌తో పాటు రేపు జరగబోయే మెసేజ్ టు గేమ్స్‌తో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూడేలా సీఎం రేవంత్ రెడ్డి చేసారని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జడ్చర్ల నియోజకవర్గంలోని రాజపూర్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో సమ్మిట్‌లు ఎన్నో జరిగాయాని కానీ ఇంత పకడ్బందీగా, ఇంత ముందుచూపుతో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణలో ఏదో పెద్ద మార్పు జరగబోతుంది అని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.

సమ్మిట్ అంటే కంపెనీలకు ఊతమిచ్చి పెట్టుబడులు తీసుకురావడమే అనుకునే విధానం నుంచి బయటకు తీసుకొచ్చి, ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో అన్ని రంగాల్లో 2036, 2047 నాటికి తెలంగాణ ఏ విధంగా ఉండాలనే స్పష్టమైన ఆలోచనా విధానంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించారని మంత్రి తెలిపారు. తెలంగాణ యువత ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రాన్ని రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రతిష్టాత్మక రంగాల్లో రూపురేఖలను మార్చి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ, జీడీపీ వృద్ధిలో భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణను ముందంజలో నిలబెట్టడం లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు.

తన శాఖ అయిన క్రీడారంగంలోనే ఇప్పటివరకు దాదాపు 26 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఇంతకాలం కన్న కల ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ నెరవేర్చలేకపోయినా, రాబోయే ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సీఎం కప్ పేరుతో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఫీల్డులను మెరుగుపరుస్తూ, కోచ్‌లను నియమిస్తూ, క్రీడాకారులకు శిక్షణ అందిస్తూ గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌తో పాటు గ్లోబల్ సమ్మిట్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు తెలంగాణ వైపు చూస్తుండటం రాష్ట్రానికి శుభపరిణామమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow