Govt On IndiGo Schedule Crisis : దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ-ఇండిగోలో సంక్షోభం మరింత ముదిరింది. శుక్రవారం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా విమాన సర్వీసులు రద్దు కాగా, శనివారం కూడా 1000 కంటే కాస్త తక్కువ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. పరిస్థితి డిసెంబర్ 10-15 నాటికి సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఇండిగో గత కొద్ది రోజులుగా 1000 కంటే ఎక్కువ లేదా దాని రోజువారీ సర్వీసుల సంఖ్యలో సగానికి పైదా రద్దు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిగో సీఈఓ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ శుక్రవారం ఓ వీడియో సందేశం ఇచ్చారు. దురదృష్టవశాత్తు, మేము తీసుకున్న ముందస్తు చర్యలు ఏమాత్రం సరిపోలేదు. కనుక మేము ఈ రోజు మా అన్ని వ్యవస్థలను, షెడ్యూల్లను రీబూట్ చేయాలని నిర్ణయించాం. అందుకే చాలా ఫ్లైట్స్ రద్దు అయ్యాయి. కానీ శనివారం 1000 కంటే తక్కువ ఫ్లైట్స్ రద్దులు ఉంటాయని ఆశిస్తున్నాము" అని పీటర్ ఎల్బర్స్ అన్నారు.
త్వరగా సర్వీసులు ప్రారంభించండి!
ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిన వేళ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన షెడ్యూల్ అంతరాయాల్ని పరిష్కరించాలని, ఆలస్యం చేయకుండా విమాన సర్వీసులు ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలను, ముఖ్యంగా ఇండిగోను ఆదేశించింది. మరోవైపు ఇండిగో వ్యవహారంపై నలుగురి సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కే బ్రహ్మానే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్‌గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ కెప్టెన్ కపిల్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ రాంపాల్ సభ్యులుగా ఉన్నారు. ఇండిగో విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలను దర్యాప్తు కమిటీ విచారించి 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీ భవిష్యత్తులో ఈ తరహా అంతరాయాలు చోటుచేసుకోకుండా కమిటీ విచారించి సిఫార్సులు చేయనుంది.