కామారెడ్డి, ఎల్లారెడ్డి, న్యూస్‌టుడే: కామారెడ్డిజిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేటలో సర్పంచిగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థి ఇంటిని... గెలిచిన అభ్యర్థి సోదరుడు ట్రాక్టరుతో ఢీకొట్టడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... రెండో విడతలో భారాస బలపరిచిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఎన్నికల్లో ఓడిపోవడంతో సోమవారం ఆయనను పరామర్శించడానికి పలువురు గ్రామస్థులు వెళ్లారు. అందరూ ఇంటి ముందు కూర్చుని మాట్లాడుతుండగా... ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుర్మ పాపయ్య సోదరుడు కుర్మ చిరంజీవి ట్రాక్టరుతో వారిపై దూసుకొచ్చి గోడను ఢీకొట్టాడు. స్థానిక మహిళలు గండి భారతి, బండమీది బాలామణి ట్రాక్టర్ టైర్ల కింద ఇరుక్కుపోగా.. శారద, సత్తవ్వ, పద్మ, అద్విత్(5)కు తీవ్ర గాయాలయ్యాయి. భారతి, బాలామణి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు, మిగతా వారిని ఎల్లారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పనులకు వెళ్తుండగా ట్రాక్టరు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లిందని పాపయ్య చెబుతున్నారు. కక్షపూరితంగానే దాడి చేశారని, ఎన్నికల అనంతరం అంతుచూస్తామంటూ ముందే హెచ్చరించారని బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో భారాస మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, కార్యకర్తలు ఎల్లారెడ్డి-నిజాంసాగర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఓ వీడియో విడుదల చేశారు.
Tags
Telangana