• *కాంగ్రెస్ అభ్యర్థులు ఇచ్చిన హామీలన్నీ నావే అనుకుంటా*
• *సింగిల్ గా పోటీ చేసినా సెంచరీ కొట్టాం*
• *జడ్చర్లలో 108 స్థానాలు గెలిచాం.. మరో 35 మంది మాతో టచ్ లో ఉన్నారు*
• *బీఆర్ఎస్ సొంతంగా 10 శాతం సీట్లు కూడా గెలువలేదు*
• *గ్రామ ఇంచార్జీలుగా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు*
• *ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ*
జడ్చర్ల, డిసెంబర్ 18: సర్పంచ్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా మంచి వాడైతే తాము దగ్గరకు తీస్తామని, కబ్జాలు చేసి ప్రజల్ని భయపెట్టాలని చూస్తే సహించబోమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను గ్రామ ఇంచార్జీలుగా చేస్తామని, ఎమ్మెల్యే నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు.
పంచాయితీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా 108 పంచాయితీల్లో కాంగ్రెస్ సర్పంచులు గెలిచారని, వారు కాకుండా గెలిచిన ఇతర సర్పంచుల్లో మరో 35 మంది దాకా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామంటూ తమకు టచ్ లోకి వచ్చారని వెల్లడించారు. 22న సర్పంచుల ప్రమాణ స్వీకారం అనంతరం గెలిచిన సర్పంచులకు సన్మానం చేస్తామని, ఆ తర్వాత ఈ విషయాలపై స్పష్టత వస్తుందని చెప్పారు. అయితే ఛస్తామని బెదిరించి, స్కూలుకు వెళ్లే పసి పిల్లలతో కాళ్లు మొక్కించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 శాతం సర్పంచ్ స్థానాలను కూడా నేరుగా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేసారు. సర్పంచులు ఏ పార్టీకి చెందిన వారైనా వాళ్లు మంచి వాళ్లయితే వారిని దగ్గరకు తీస్తామని అనిరుధ్ హామీ ఇచ్చారు. అయితే సర్పంచ్ పదవులను అడ్డుపెట్టుకొని భూకబ్జాలు చేయాలని, ప్రజలను భయభ్రాంతులను చేయాలని చూస్తే మాత్రం తాను సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేసారు.ఇప్పటికే కొందరు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గత రెండేళ్లుగా ఎలాంటి భూకబ్జాలు జరగకుండా నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, ఈ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని ఎవరు చూసినా సహించబోనని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఆయా గ్రామాల్లో ఉండే ఇందిరమ్మ కమిటీ సిఫార్సుతోనే మంజూరు అవుతాయని, ఇందులో సర్పంచుల ప్రమేయం ఉండదని అనిరుధ్ రెడ్డి చెప్పారు. అయితే ఇప్పటి వరకూ తాము నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో 40% బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే వచ్చాయని, అర్హత ఉన్న వారి విషయంలో తాము రాజకీయ వివక్ష చూపలేదని పేర్కొన్నారు. సర్పంచులు మంచివారైతే వారి సలహాలు కూడా కమిటీలు పరిగణలోకి తీసుకుంటాయని తెలిపారు. కాగా పంచాయితీ ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయా గ్రామాలకు ఇంచార్జులుగా పెడతామని, ఎమ్మెల్యే నిధుల ద్వారా చేపట్టే అభివృద్ధి పనుల మంజూరులో గ్రామ ఇంచార్జులకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వారికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎస్డీఎఫ్ నిధులు వచ్చాయని, కొత్తగా గెలిచిన సర్పంచులు తమ ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి తమ గ్రామాల్లో తాము ఇచ్చిన హామీల మేరకు ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇస్తే వాటిని మంజూరు చేయిస్తామని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్తులు ఇచ్చిన హామీలన్నీ తాను ఇచ్చిన హామీలుగానే భావిస్తానని చెప్పారు. పంచాయితీ ఎన్నికలలో వివిధ హామీలను ఇచ్చిన వారు వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయాలని కోరారు.
• *