గురుడు, శుక్రుడు అస్తంగత్వం (మౌఢ్యమి) చెందడమనేది భారతీయ జ్యోతిషం, ముహూర్త శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన కాలం. ఈ సమయంలో శుభకార్యాల్ని నిలిపివేయడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. ఈ ఏడాది నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు (అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు) శుక్ర మౌఢ్యమి (Shukra Moudyami). మొత్తంగా 83 రోజుల పాటు ఈ మౌఢ్యమి ఉంటుంది. అందువల్ల మాఘ మాసం వరకు పూర్తిగా వివాహాది కార్యక్రమాలకు శుభ ముహుర్తాల్లేవు. ఈ నేపథ్యంలో అసలు శుక్ర మౌఢ్యమి అంటే ఏమిటి? ఈ కాలంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.
మౌఢ్యమి అంటే?
గురుడు లేదా శుక్ర గ్రహం సూర్యుడితో కలిసుండే కాలం మౌఢ్యమి. దీన్నే వాడుకలో ‘మూఢమి’ అని కూడా అంటాం. మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం ద్వారా మూఢమి సంభవిస్తుంది. సూర్యుడికి, గురుడికి మధ్య 11 డిగ్రీలు, అలాగే, సూర్యుడికి శుక్రుడికి మధ్య 8డిగ్రీల (వక్రదిశలో) దూరం, 10 డిగ్రీల (సవ్య దిశలో) దూరం గనక ఉంటే మౌఢ్యమి వస్తుంది. సౌర కుటుంబానికి పెద్ద సూర్యుడు. ఆయన శక్తి, కాంతి అనంతం. గురు, శుక్రుడు శుభ గ్రహాలు. ఈ గ్రహాలు మౌఢ్యమి సమయంలో తేజస్సును కోల్పోవడం వల్ల శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు.
మౌఢ్యంలో ఏమేం చేయరాదు..
గురు-శుక్ర మౌఢ్యమి సమయంలో పెళ్లిచూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు, వధూప్రవేశం, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయనం, వాహనం కొనడం, బావి-చెరువులు- బోర్లు తవ్వడం, పుట్టువెంట్రుకలు తీయించడం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, వ్యాపారాలను ఆరంభించడం, మహాదానాలు, అపూర్వ దేవతీర్థ దర్శనం, యాత్రలకు వెళ్లడం, కొత్త ప్రయాణాలు ఆరంభించడం, రాజ దర్శనము, రాజ్యాభిషేకం వంటివి నిషిద్ధం.
ఏయే పనులు చేయొచ్చు?
ముహూర్త గ్రంథాలు కొన్ని అనివార్య, నిత్య కర్మలకు ఈ మౌఢ్య దోషం వర్తించదని పేర్కొన్నాయి. నిత్యయానం (రోజువారీ ప్రయాణాలు), నిత్యారాధన, అభిషేకం, నవగ్రహ శాంతి, జప, హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాశనాది కార్యక్రమాలు, పాత ఇంటి మరమ్మతులు (రీమోడలింగ్), నూతన వస్త్రధారణ, చాతుర్మాస్య వ్రతాలు వంటివి శుక్ర మౌఢ్యమి రోజుల్లో వచ్చినా నిరభ్యంతరంగా చేయొచ్చు.