ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో కూడా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు! ప్రాసెస్ ఇదే..
గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు నేరుగా బుక్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రూట్ వెతుకుతున్నప్పుడు, అందుబాటులో ఉన్న బస్సుల వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన బస్సును ఎంచుకుని, ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు.
ఎలా చేసుకోవాలి..?
గూగుల్ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్ అని టైప్ చేస్తే.. వీటి మధ్య దూరం ఎంత, బైక్, కారు, బస్, రైళ్లలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు జనరల్ ట్రాన్సిట్ స్పీడ్ స్పెసిఫికేషన్ (జీటీఎస్‌ఎఫ్) ద్వారా కనిపిస్తాయి. అందులో బస్ సింబల్ ఉన్నచోట క్లిక్ చేస్తే విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ఎన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి, అవి ఏ సమయాల్లో బయలుదేరతాయి? ఎన్ని గంటల్లో చేరుకుంటాయనే వివరాలు కనిపిస్తాయి. మీకు అనుకూలమైన సమయానికి ఉన్న బస్సుపై క్లిక్ చేస్తే నేరుగా ఆర్టీసీ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
ఆర్టీసీ అధికారులు, గూగుల్ ప్రతినిధులతో చర్చించి ప్రయోగాత్మకంగా విజయవాడ- హైదరాబాద్ మార్గంలో దీనిని అమలు చేశారు. కొద్ది రోజులపాటు దీనిని పరిశీలించగా విజయవంతంగా బుకింగ్స్ జరిగాయి. ఇదంతా మూడు నెలల కిందట పూర్తయింది. దీంతో ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయమున్న ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ఏయే రూట్లలో తిరుగుతాయో వాటి వివరాలను గూగుల్‌కు అందజేశారు. గూగుల్ ఆయా రూట్లలో బస్టాప్‌ల వారీగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వంటివన్నీ ఆడిట్ టెస్ట్ జరిపి, మూడు రోజుల కిందట ఆమోదం తెలిపింది. వారంలో అన్ని రూట్లలో గూగుల్ మ్యాప్స్ ద్వారా బస్ టికెట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు.