DCC President: పాలమూరు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

 



DCC President:  పాలమూరు జిల్లా డీసీసీ చీఫ్ జిల్లా పార్టీలో కొందరు నేతలపై గుర్రుగా ఉన్నారంట. డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాటను జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు డోంట్ కేర్ అంటున్నారట. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సక్యత లేదన్న చర్చ మొదలైంది. వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫాంలు పొందాలనుకుంటే మాత్రం కుదరదు అంటూ కార్యక్రమాలకు హాజరుకాని నాయకులకు మధుసూధన్ చురకలు అంటిస్తున్నారంట. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారని డీసీసీ ప్రెసిడెంట్ ఆగ్రహంగా ఉన్నారంట.. అసలు పాలమూరు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్

ఉమ్మడి పాలమూరు జిల్లా. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుందని నమ్మకంతో ఉంటారు నేతలు..గత అసెంబ్లీ ఎన్నికలలో 14 స్థానాలకు గాను 12 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి పాలమూరు కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది.

గైర్హాజరైన ఎమ్మెల్యేలు

ఇటీవల ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.దీంతో అన్ని జిల్లాలో మాదిరిగానే మహబూబ్ నగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఈ కార్యక్రమానికి జిల్లా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గైర్హాజరు కావడంతో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొనకపోవడం ఏంటని వేదికపైనే సదరు ఎమ్మెల్యేలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ కార్యక్రమానికి సంబంధించి సమాచారాన్ని అందించినా ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని మండిపడ్డారు. తమకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తాం అంటే కుదరదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు.

పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరికలు

పార్టీ కార్యక్రమాలకు హాజరు కాని వారిపై డీసీసీ అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోఎవరో తమకు బిఫామ్ లు ఇప్పిస్తారనే పగటి కలలు కనవద్దు అంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. పార్టీ కార్యక్రమాలకు ఎవరు హాజరవుతున్నారు.. ఎవరు గైర్హాజరు అవుతున్నారు అనే విషయాలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు రిపోర్ట్ చేస్తానని ఫైర్ అయ్యారు. ఏఐసీసీ పరిశీలనకు కూడా ఎప్పటికప్పుడు అన్ని విషయాలను రిపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి, అందరూ అది దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు.

ఎమ్మెల్యేల పై జీఎంఆర్ ఫైర్

ప్రత్యక్షంగా కార్యకర్తలపై.. పరోక్షంగా ఎమ్మెల్యేలపై జీఎంఆర్ మండిపడడం పార్టీలో కొత్త చర్చలు తావిస్తోంది. కేవలం ఓట్ చోరీ కార్యక్రమంలోనే కాదు గత కొన్నాళ్లుగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు.. పార్టీ కార్యాలయానికి కూడ కొంత దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అంటే వారి క్యాంప్ కార్యాలయాల్లోనే నిర్వహించుకున్నారట ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. దీంతో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్ రెడ్డికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయంట. అందుకే ఆయనతో కలిసి వేదికను పంచుకోవడం లేదనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.

మధుసూదన్ రెడ్డి వ్యవహారి శైలిపై ఆరోపణలు

ఎన్నికలకు ముందు పార్టీ గెలుపుకోసం కలిసి పనిచేసిన ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే మిగతా ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి వేదికను పంచుకునేందుకు.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అయిష్టంగా ఉన్నారని ఆ ఎమ్మెల్యేల అనుచరులు అంటున్నారు. మధుసూదన్ రెడ్డి పార్టీకి సంబందించి తీసుకునే నిర్ణయాల్లో కనీసం తమతో చర్చించకుండా.. తమ అభిప్రాయాలతో పని లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారని.. తమపై కొంత అజమాయిషీ చలాయించేందుకు డీసీసీ చీఫ్ ప్రయత్నించడం వల్ల.. అది నచ్చకే పార్టీ కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొనేందుకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అనాసక్తిగా ఉంటారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నకాంగ్రెస్ పార్టీ

సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లోపించడానికి కారణం డీసీసీ చీఫ్ ఒంటెద్దు పోకడలే అని మిగతా ఎమ్మెల్యేల అనుచరులు అంటుంటే.. తాను మాత్రం అందరితో కలిసే ఉంటున్నానని.. అన్ని కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తోటి ఎమ్మెల్యేలకు ఇస్తున్నానని డీసీసీ చీఫ్ అంటున్నారు. మొత్తమ్మీద స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం సొంతజిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్తితి క్యాడర్ ను ఆందోళనకు గురిచేస్తోందంట. ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్న దూరం పార్టీకి నష్టం చేస్తోందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow