గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు శాఖలో అక్రమ వసూళ్ల వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదలైన ఈ గందరగోళం.. ఒక కానిస్టేబుల్ చేసిన సంచలన ఆరోపణలు, ఆత్మహత్య బెదిరింపుతో తారా స్థాయికి చేరింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకోవడంతో ఎస్పీ అత్యవసరంగా అంతర్గత విచారణకు ఆదేశించారు.
వసూళ్ల వేట.. కేటీ దొడ్డి పోలీస్టేషన్ నుండి మొదలు
ఈ వివాదానికి ప్రధాన మూలం కేటి దొడ్డి మండలంలోని పాగుంట జాతరతో పాటు నిరంతరం జరుగుతున్న ఇసుక ట్రాక్టర్ల అక్రమ రవాణా వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహారమే జిల్లాలో కీలకంగా మారిన ఈ వసూళ్లపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి ఆ వెంటనే, జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస్ రావ్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై బిజ్జ శ్రీనివాస్, కానిస్టేబుల్ రజని బాబులను తక్షణమే విధులనుంచి తప్పించి, ఏఆర్ (Armed Reserve)కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
ఆత్మహత్య బెదిరింపు.. ఉన్నతాధికారుల గుండెల్లో గుబులు
తనపై ఏకపక్షంగా వేటు వేయడంపై కానిస్టేబుల్ రజని బాబు తీవ్రంగా స్పందించారు. అతను సోషల్ మీడియా వాట్సాఫ్ గ్రూపు వేదికగా చేసిన పోస్టులు జిల్లా పోలీసు శాఖలో పెను ప్రకంపనలు సృష్టించాయి. "నన్ను బలిపశువును చేస్తే, అక్రమ వసూళ్లకు పాల్పడిన మరికొందరి 'చిట్టా' తీస్తాను. ఆ తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను" అంటూ కానిస్టేబుల్ రజని బాబు తన కుటుంబానికి వీడియో కాల్ చేసి చెప్పి ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి నట్టు సమాచారం. కానిస్టేబుల్ ఆత్మహత్య బెదిరింపు తో ఈ వసూళ్ల దందా కేవలం కింది స్థాయి సిబ్బందికే పరిమితం కాలేదని, దీని వెనుక మరికొంతమంది ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
విచారణకు ఆదేశం.. తెరపైకి తేజేశ్వర్ కేసు
పరిస్థితి చేయి దాటకముందే, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణకు ఎస్పీ శ్రీనివాస్ రావ్ ఆదేశించారు. పలువురు పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరిపే బాధ్యతను జిల్లా అదనపు ఎస్పీ శంకర్ కు అప్పగించారు. ఈ విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఎస్పీ ఆదేశించారు. ఇదే సమయంలో, ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా జిల్లా ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్ల వ్యవహారంతో పాటు, ఇతర కేసుల నిర్వహణలో కూడా పోలీసు శాఖపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత విచారణపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అదనపు ఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా, జిల్లా పోలీసు శాఖలో కీలక మార్పులు, మరికొందరు అధికారులపై చర్యలు ఉండే అవకాశం ఉందని పోలీసు వర్గాలు జిల్లా ప్రజలు భావిస్తున్నారు .