మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గద్వాల పట్టణం నుండి అయిజ టూ కర్నూల్ వైపు వెళ్తున్న బస్సుకు ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపించింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును వెనువెంటనే నిలిపి సిఓటు సిలిండర్‌తో వ్యాపించిన మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే... గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 7:30 గంటలకు గద్వాల నుండి బయలుదేరింది. ఐజ పట్టణానికి 8 గంటల 40 నిమిషాలకు చేరుకున్న తర్వాత కర్నూల్‌కు బయలుదేరింది.
మార్గమధ్యలో మానవపాడు మండలంలోని మద్దూరు స్టేజి సమీపంలో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుకు మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలియక బస్సులో ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ డ్రైవర్ సత్య రెడ్డి బస్సు నిలిపివేయడంతో ... ప్రయాణికులంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. బస్సులో కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌టింగ్విషర్ (CO2) సిలిండర్ ఉండటంతో బస్సు వెనుక మంటలు చెలరేగిన ప్రాంతాన్ని గుర్తించి వెంటనే డ్రైవర్ మంటలను ఆర్పుటకు ప్రయత్నం చేశాడు. పక్కనే ఆర్డిఎస్ కాలువ ఉండడంతో ప్రయాణికులు అడ్డుగా వెళ్లే మద్దూరు గ్రామస్తులు కూడా బకెట్లతో నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలం కు పోలీసులు చేరుకుని బస్సుకు మంటలు ఎలా వ్యాపించాయో ఆరా తీస్తున్నారు.
ఓవర్ లోడుతో వెళ్తుండడంతోనే ఈ ప్రమాదం- డ్రైవర్ సత్య రెడ్డి
ఆర్టీసీ బస్సులో కెపాసిటీ కన్నా అధికంగా 130 మందికి పైగా ప్రయాణికులు ఎక్కినట్లు డ్రైవర్‌తో పాటు కండక్టర్ తెలిపారు. ఫ్రీ బస్సు ఉండడంతో మహిళలు కూడా అధిక సంఖ్యలో ఎక్కడం... వద్దంటే మా పై ఫిర్యాదు చేస్తారు. బస్సు వెళ్తున్న సమయంలో మద్దూరు స్టేజి దగ్గర ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలతో పాటు పొగలు భారీగా వ్యాపించాయి. దీంతో వెంటనే బస్సును నిలిపి మంటలను ఆర్పుటకు ప్రయత్నం చేశాను. ప్రయాణికులు కూడా తమవంతుగా వెను వెంటనే బస్సు దిగి పక్కనే ఉన్న ఆర్డీఎస్ కాలువ నుండి బకెట్లతో నీళ్లు తీసుకువచ్చి మంటలను ఆర్పేశారు. లేదంటే ఒక్కసారిగా బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యేదని డ్రైవర్ దిశ న్యూస్‌తో తెలిపాడు.