ఆర్టీఏ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే సేఫ్టీ, నిబంధనలు గుర్తొస్తాయా? అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఘటన మంచి హైప్ మీద ఉన్నప్పుడు హడావుడి దాడులు, సీజ్ చేయడం చేస్తుంటారని.. జనం మర్చిపోగానే సదరు ఆర్టీఏ అధికారులు సైతం సైలెంట్ అయిపోతారని అంటున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30, 2013లో బస్సు దగ్ధం అయి 45 మంది చనిపోయినప్పుడు సైతం ఇదే చేశారు. అప్పుడు కూడా కొంత కాలం పాటు వోల్వో స్లీపర్ బస్సులు రోడ్డెక్కకుండా నిలువరించారు. చాలా కఠినంగా వ్యవహరించారు. క్రమంగా విషయం చల్లబడిన తర్వాత అధికారులు ఎప్పటిలాగే తనిఖీల విషయంలో సడలింపులు ఇచ్చేశారు. గత నెల 25న కర్నూలు వద్ద ప్రైవేటు స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది చనిపోయిన ఘటనలోనూ ఇదే నిరూపితమైంది. ఎప్పటిలాగే దాడులు ప్రారంభించి ఆపేశారు. ఇక ఈనెల 3న చేవెళ్ల వద్ద ఆర్టీసీ- కంకర ట్రిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది చనిపోగా... ఇప్పుడు టిప్పర్లు, భారీ వాహనాలపై తనిఖీలు చేపడుతున్నారు.
ప్రమాదం జరిగాకే స్పందన
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులను రద్దు చేయడంతో సుమారు 100 మంది రవాణా శాఖ అధికారులకు తనిఖీల డ్యూటీని కేటాయించారు. వారికి ఇక చెక్ పోస్టు డ్యూటీ ఉండనే ఉండదు. రోడ్లపై తనిఖీలు చేపట్టి నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవడమే వీరి బాధ్యత. అలాంటప్పుడు ఎక్కడికక్కడ ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలను అడ్డుకుని జరిమానాలు విధించడం, సీజ్ చేయడం చేయాల్సి ఉన్నా పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మంత్రి, ఉన్నతాధికారులు సమీక్షలు జరిపి దాడులు చేయాలని ఆదేశించినప్పుడు మాత్రం తనిఖీలను విస్తృత్తం చేస్తారు. కర్నూలు ఘటనలో బస్సు అద్దాలు బ్రేకబుల్ అయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సౌకర్యం, సీట్ల మోడిఫికేషన్ లేకుంటే మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అదే విధంగా చేవెళ్ల ఘటనలోనూ కంకర ట్రిప్పర్ ఓవర్ స్పీడ్ లేకుండా.. నిబంధనల మేరకు మాత్రమే లోడ్‌తో వచ్చి ఉంటే ప్రమాదం జరిగే అవకాశం కూడా తక్కువే ఉండేదని రవాణా రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగాక చేసే దాడులు ఏవో ముందే చేసి ఉంటే ఈ పరిస్థితే వచ్చేదే కాదని అంచనా వేస్తున్నారు.
అడుగడుగునా అడ్డంకులే..
మరోవైపు కనీస సౌకర్యాలు లేకుండా రవాణా శాఖ అధికారుల నుంచి తనిఖీలను ఆశించడం కూడా అత్యాశే. రవాణా శాఖలో ప్రస్తుతం ఆర్టీవోలు 22, ఎంవీఐలు 141, ఏఎంవీఐలు 199... మొత్తం 362 మంది తనిఖీలు చేసే అధికారులు ఉన్నారు. వీరిలో దాదాపు 180 నుంచి 200 మంది అధికారులకు కనీసం వాహన సౌకర్యం లేదు. వీరంతా రోజు డ్యూటీకి రావడం, వెళ్లడం తప్ప ఫీల్డులోకి వెళ్లి తనిఖీలు నిర్వహించేందుకే అవకాశం లేదు. ఇదంతా పట్టించుకోని ఉన్నతాధికారులు మాత్రం తప్పనిసరిగా తనిఖీలు చేయాలని ఆదేశిస్తారని.. కనీసం తమకో టూ వీలర్ అయినా ఇచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. తనిఖీలకు వెళ్లాలంటే ఓ వాహనం, డ్రైవర్, హోంగార్డు తప్పనిసరి. అవేమీ లేకుండా తనిఖీలు ఆశించడం కూడా అత్యాశే అవుతుందని ఓ ఎంవీఐ ‘దిశ’తో వాపోయారు. ఇక ఏదో విధంగా తనిఖీలకు వెళ్లిన సందర్భాల్లో ఏదైనా వాహనాన్ని పట్టుకుంటే ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తాయని... అది ఫలానా వారిది వదిలెయ్ అని చెప్పేస్తే చేతులు కట్టేసుకున్నట్లుగా ఉంటోందని చెబుతున్నారు. ఏదైనా అతి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు జనం దృష్టిలో మేం కూడా పనిచేస్తున్నామని చెప్పేందుకు తప్ప తాము చేసే తనిఖీలు అంతా తూతూమంత్రమేనని ఓ ఏఎంవీఐ వాపోయారు.
రూల్స్ ఉల్లంఘిస్తున్న భారీ వాహనాలు
పార్టీలకతీతంగా రాష్ట్రంలో చాలా మంది రాజకీయ నేతలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగానో, బిల్డర్లు గానో ఉన్నారు. మరికొందరైతే నేరుగా ఇసుక, కంకర వ్యాపారమే చేస్తారు. 2015 నవంబర్ 9న వెలువడిన జీవో ఎంస్ నెం.50 ప్రకారం డంపర్లు, ట్యాంకర్లు, పాఠశాల బస్సులు, ప్రమాదకరంగా సరుకులు తీసుకెళ్లే టిప్పర్ వంటి భారీ వాహనాల గరిష్ఠ వేగం 60 కి.మీ. మాత్రమే ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇది వర్తించడం లేదు. చేవెళ్ల ప్రమాదంలోనూ ఇది స్పష్టంగా నిరూపితమైంది. భారీ వాహనాల్లో వేగ నియంత్రికలు (స్పీడ్ గవర్నర్) అమర్చాలి. కానీ వాటిపై కనీసం దృష్టి పెట్డిన పాపాన పోలేదు. రాష్ట్రంలో ఏ భారీ వాహనం కూడా వేగ నియంత్రికలతో రోడ్డుపైకి రావడం లేదు. అంటే ప్రభుత్వాలు తీసుకువచ్చే నిబంధనలను వారే అమలు చేయలేకపోయినప్పుడు ప్రమాదాలకు అడ్డుకట్ట ఎలా పడుతుందని రిటైర్డ్ రవాణా శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చి పదేళ్లు అయినా కూడా కఠినంగా వ్యవహరించడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఓవర్ లోడ్ వల్ల ప్రమాదాలు..
ఓవర్ స్పీడే కాదు... ఓవర్ లోడ్ కూడా ప్రమాదాలకు కారణం. ఓవర్ లోడ్ వల్ల వాహనాలను నియంత్రించడంలో డ్రైవర్లు వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. త్వరగా కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు. ఓవర్ లోడ్ వెహికిల్ వేగంగా వెళ్లడం ఎంత ప్రమాదమో చేవెళ్ల ఘటన ఉదాహరణగా నిలుస్తుందని అర్థం అవుతోంది. అందుకే ఓవర్ లోడ్ వాహనాలకు తూతూమంత్రం జరిమానాలు సరిపోవని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తనిఖీలు షురూ..
బుధవారం నాగోల్ ఆర్టీఏ అధికారులు ఓవర్ లోడ్‌తో వెళ్తున్న 3 టిప్పర్లను సీజ్ చేశారు. మిగతా అధికారులు సైతం వాహనాల తనిఖీలు చేపడుతున్నారని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. గత నెల 25న కర్నూలు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం తర్వాత ఆ రోజు నుంచి ఈనెల 3 వరకు ఆర్టీఏ అధికారులు దాడులు జరిపారు. అప్పటివరకు రెగ్యులర్‌గా మీడియాకు నివేదికలు అందించారు. చేవెళ్ల ఘటన తర్వాత స్లీపర్ బస్సుల తనిఖీలు ఆపేశారు. ఇప్పుడు టిప్పర్లపై తనిఖీలు చేస్తున్నారు. స్కూల్ బస్సు ప్రమాదం జరిగితే వాటిపై, ట్రావెల్స్ బస్సు కాలిపోతే ఆ బస్సులపై, టిప్పర్ ఢీకొని ప్రమాదం జరిగినప్పుడు వాటిపై దాడులు... ఇలా గాలివాటంలా కాకుండా రెగ్యులర్ విధుల్లో భాగంగా తనిఖీలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటు వాహనాల నిబంధనల విషయంలో మాత్రమే కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనూ ఓవర్ లోడ్ కారణంగా ప్రమాదాలకు ఆస్కారం ఉందని.. వారిపైనా తనిఖీలు చేపట్టాలని ప్రైవేటు వాహనాల యజమానులు కోరుతున్నారు.