శాస్త్ర, సాంకేతిక రంగాల వారంతా ఒకే వేదికపై కలిసేందుకు ESTIC-2025 ఎంతగానో ఉపయోగపడుతోందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని, కలిసి పని చేస్తూ.. వచ్చే రెండు దశాబ్దాలకు మన విజన్ రెడీ చేసుకోవాలని సూచించారు.
మరోవైపు, రూ.400 కోట్లతో మూడో లాంఛ్ ప్యాడ్ ను తమిళనాడులో నిర్మించేందుకు ఆమోదం పొందామని ఛైర్మన్ వెల్లడించారు. జనవరి 6న ఆదిత్య ఎల్-1 మిషన్ నుంచి సేకరించిన 10 టెరాబైట్ల సాంకేతిక డేటాను విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకు ఆదిత్య మిషన్ నుంచి దాదాపు 15 టెరాబైట్ల డేటాను ప్రచురించామని చెప్పారు.
అంతేకాదు, తొలిసారిగా ఆర్బిట్ డాకింగ్ ప్రయోగం స్పేడెక్స్ను జనవరి 16న చేపట్టామని.. గంటకు 28,400కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేశామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. ఆల్గారిథమ్స్, కెమెరాలతోపాటు వివిధ వ్యవస్థలను ఉపయోగించి ఈ రెండు శాటిలైట్లను విజయవంతంగా డాకింగ్ చేశామని ఆయన చెప్పారు. ఫలితంగా ప్రపంచంలోనే స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డ్ సృష్టించిందన్నారు.
కాగా, ESTIC-2025 కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇందులో స్పేస్ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, డీఆర్డీఓ లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. ఇందులో 40కి పైగా సాంకేతిక స్టార్టప్ సంస్థల నవకల్పనలు ప్రదర్శిస్తారు.