నల్గొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హత్యాచారం - అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కృష్ణ - పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు
Student Murder In Nalgonda : నల్గొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నల్గొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఓ ఇంట్లో యువతి మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
యువకుడి మాయ మాటలే కారణమా? : ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపి, చనిపోయిన యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న తమ కుమార్తె మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. ఈ కేసులో ముందుగా అనుమానాస్పద మృతిగా భావించినా తరువాత అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా గుర్తించి కేసు నమోదు చేశారు. నిందితుడు గడ్డం కృష్ణ కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితుని సెల్‌ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.
నిందితుడిపై పోక్సో కేసు : నిందితుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గడ్డం కృష్ణ(22) గా పోలీసులు భావిస్తున్నారు. ఉదయం ఆమెను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేసినట్లు తెలిపారు. నిందితుడు గడ్డం కృష్ణపై వన్ టౌన్ పీఎస్‌లో రేప్, పోక్సో కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. ఘటనలో ఇంకా ఎవరెవరున్నారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను సేకరించి దోషులకు త్వరగా శిక్షపడే విధంగా కృషి చేస్తామని అన్నారు. కాగా నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గడ్డం కృష్ణతో పాటు సహకరించిన అతని స్నేహితుడిపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు.