*
• ఈ మేరకు ఎమ్మెల్యేకు లేఖ రాసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
• బైపాస్ రోడ్డు మంజూరుకు మార్గం సుగమం
• ఫలిస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రయత్నం
• ఎమ్మెల్యే తోపాటుగా ఎంతగానో కృషి చేస్తున్న ఎంపీ డీకే అరుణమ్మ
• తోడ్పాటునందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి,
• ఎమ్మెల్యే, ఎంపీలకు సహకరిస్తున్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి
• వెల్లడించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, అక్టోబర్ 7: జాతీయ రహదారి నెంబర్ 167 విస్తరణతో పాటుగా జడ్చర్ల బైపాస్ నిర్మాణాని డీపీఆర్ రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీకి ఆదేశించామని, వీటి నిర్మాణానికి అవసరమైన నిధులను ఈ ఏడాది బడ్జెట్ లోనే కేటాస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గడ్కరీ తనకు లేఖ రాసారని వెల్లడించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గత మేనెల లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటుగా షాద్ నగర్ ప్రాంతంలో ఆయనను కలిసి జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణ ఆవశ్యకతను గురించి తెలిపి, జడ్చర్లకు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలంటూ వినతి పత్రాన్ని కూడా సమర్పించిన విషయం తెలిసిందే. ఇటీవలే మరోసారి ఢిల్లీలో కూడా ఈ విషయంగా గడ్కరీతో కలిసి జడ్చర్ల బైపాస్ రోడ్డు గురించి చర్చించారు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణం మీదుగానే హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి నెం. 44, రాయచూరు- కోదాడ జాతీయ రహదారి నెం.167 పట్టణం మధ్యలో నుంచి వెళుతుండటంతో రోజూ వేల సంఖ్యలో వాహనాలు జడ్చర్ల గుండా రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుందని, దీనివల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని గడ్కరీకి అనిరుధ్ రెడ్డి వివరించానని మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి గుర్తు చేసారు. దీనితోపాటు గా హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్లకు బైపాస్ రోడ్డు అత్యవసరమని అందుకే వెంటనే బైపాస్ మంజూరు చేయాలని తాను కోరగా ఈ విషయంగా గడ్కరీ అప్పట్లోనే సానుకూలంగా స్పందించారని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ తనకు అధికారికంగా లేఖ రాసారని, అందులో 167 వ నెంబర్ జాతీర రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి, అలాగే జడ్చర్ల బైపాస్ రోడ్డు కు సంబంధించిన పనులపై అధ్యయనం చేసి డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను రూపొందించడానికి కన్సల్టెంట్ ను నియమించడం జరిగిందని, వారి నుంచి డీపీఆర్ వచ్చిన తర్వాత, ఈ పనులను చేపట్టడానికి ఈ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని కూడా గడ్కరీ స్పష్టం చేసారని వివరించారు. దీంతో జడ్చర్ల బైపాస్ నిర్మాణానికి మార్గం సుగమమైయిందని అభిప్రాయపడ్డారు. జడ్చర్ల బైపాస్ నిర్మాణంతో జడ్చర్ల పట్టణం మరింత విస్తరించడంతో పాటుగా పట్టణ ప్రగతి కూడా పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు. జడ్చర్ల బైపాస్ రోడ్డు మంజూరు కోసం తనకు ఎంతగానో సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తనతో పాటుగా ఈ రోడ్డు మంజూరుకు కృషి చేస్తున్న ఎంపీ డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులకు ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
•
