ఇంజెక్షన్ వికటించి బాలుడి మృతి* *ఆర్.ఎం.పి ఇంటి ముందు ముందు శవంతో ఆందోళన*

 , జడ్చర్ల: జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ వద్దకు వెళ్తే





ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో బాలుడు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండల పరిధిలోని కురపల్లి గ్రామానికి చెందిన కురుమయ్య- మాధవి దంపతులకు చెందిన చిన్న కుమారుడు వరుణ్ తేజ్ (11) కు జ్వరం రావడంతో లింగంపేట గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శశికిరణ్ వద్దకు ఆదివారం సాయంత్రం తీసుకువెళ్లగా వరుణ్ తేజ్ను పరిశీలించిన ఆర్ఎంపీ డాక్టర్ బాలుడి నరానికి ఇంజక్షన్ ఇచ్చాడు. ఇక ఇంజక్షన్ ఇచ్చిన గంట తర్వాత తల్లిదండ్రులు బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇంటికెళ్లిన కాసేపటికి బాలుడు మతిస్థిమితం లేని వాడిలా మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడని, వింత చేష్టలు చేస్తుండడంతో పాటు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే జడ్చర్ల ఆసుపత్రికి, అక్కడి నుండి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు.

వెంటనే వారు ఆర్ఎంపీ డాక్టర్కు ఫోన్ చేసి ఏ ఇంజక్షన్ ఇచ్చారని ఆరా తీసి ఇంజెక్షన్ ఇయ్యాల్సిన అవసరం ఏముందని ఈ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారని జిల్లా ఆస్పత్రి వైద్యులు కూడా ఆర్ఎంపీ డాక్టర్ను మందలించారు. బాలుడికి ఇంజెక్షన్ వికటించిందని దీంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందని వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఇక మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్లో హైదరాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. రాత్రి బాలుడి శవాన్ని కురవపల్లి గ్రామంలో ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు ఉదయమే లింగంపేట గ్రామంలో ఇంటి వద్ద వైద్యం చేస్తున్న శశికిరణ్ ఇంటి వద్దకు ఆటోలో శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందర ఉంచి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆయన ఇచ్చిన ఇంజెక్షన్ వికటించే తమ బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యుడు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వచ్చిరాని వైద్యంతో బాలుడి ప్రాణాన్ని బలిగొన్న ఆర్ఎంపీ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఆర్.ఎం.పి డాక్టర్లను వైద్యం చేయకుండా నిలువరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా బాలుడు వరుణ్ తేజ్ కొడుకుల్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow