Andhra: కర్నూలులో పూర్తిగా దగ్దమైన ప్రైవేట్ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులు మృతిచెందినట్టు సమాచారం. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర V కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిబూడిదైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో.. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బైకు బస్సుకిందకు వెళ్లి పేలిపోవడంతో.. మంటలు అంటుకున్నాయి.
తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడ్డారు. పలువురు ప్రయాణీకులు సజీవదహనం అయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.
