ఎం అయినా..పీఎం అయినా..అరెస్టయితే ఔట్‌


  • 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే!.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకూ వర్తింపు

  • ఐదేళ్లు, ఆపై శిక్ష పడే క్రిమినల్‌ కేసుల్లోనే.. రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం

  • నేడు లోక్‌సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న షా.. అనంతరం పార్లమెంటరీ కమిటీకి

  • విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర.. ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు: కాంగ్రెస్‌

  • ఐదు సంవత్సరాలు, అంతకు మించి శిక్షపడే అవకాశమున్న తీవ్రమైన క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయి 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రిమండలి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తించే విధంగా బిల్లును రూపొందించారు. నేరారోపణలతో అరెస్టయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ, రాజ్యాంగ నిబంధనల్లోనూ లేదు. కానీ, రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్టయిన కేజ్రీవాల్‌ తొలిసారిగా ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోనూ చీవాట్లు తిన్నారు. తమిళనాడులోనూ అరెస్టయిన మంత్రి సెంథిల్‌ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు వేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావొద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తోందని భావిస్తున్నారు.

  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెడతారు. అవి 1) నూటా ముప్పయవ రాజ్యాంగ సవరణ బిల్లు 2) కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు 3) జమ్మూ కశ్మీరు పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. మూడు బిల్లులూ అరెస్టయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవి. మొదటిది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా, రెండోది కేంద్ర పాలిత ప్రాంతాలది, మూడోది జమ్మూ కశ్మీరు ప్రభుత్వానికి సంబంధించినది. ఈ మూడు బిల్లులను పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలనకు పంపాలని అమిత్‌షా తీర్మానాన్ని కూడా పెడతారు. ఈ బిల్లుల ప్రకారం వరుసగా 30 రోజులపాటు జైల్లో ఉన్న మంత్రి రాజీనామా చేయకపోతే 31వ రోజు ఆటోమాటిక్‌గా అతని పదవి రద్దవుతుంది. అయితే, ఆ నేరం ఐదు సంవత్సరాలు, అంతకు మించి శిక్షపడే అర్హత ఉన్న నేరమై ఉండాలి. ఏకంగా ప్రధానమంత్రి పదవిని కూడా చేయబోయే చట్టం పరిధిలోకి తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది.

  • విపక్షాలను బలహీనం చేసే కుట్ర: కాంగ్రెస్‌

    ప్రభుత్వం ప్రకటించిన మూడు బిల్లులను తప్పుడు కేసుల ద్వారా ముఖ్యమంత్రులను తొలగించి, విపక్షాలను బలహీనం చేసే కుట్రతో రూపొందించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి, విపక్ష ముఖ్యమంత్రులను జైలుపాలు చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లులు తెస్తున్నారని మండిపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించలేని పరిస్థితుల్లో విపక్ష ముఖ్యమంత్రులను తొలగించడం ద్వారా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకొనే కుట్ర చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ముఖ్యమంత్రిని ఒక్కరిని కూడా ముట్టుకోరని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ట్వీట్‌ చేశారు. రాహుల్‌గాంధీ ఓట్‌ అధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ బిల్లులను తీసుకొస్తున్నారని అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال