*’
తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. పుట్టిన రోజు ఈ నెల 11న. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన భారీ గిఫ్టులనే సిద్ధం చేశారు. వాస్తవానికి రాజకీయ నాయకుల పుట్టిన రోజు నాడు వారికి గిఫ్టులు ఇచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ, బండి సంజయ్ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనే గిఫ్టులు పంచాలని నిర్ణయించారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్.. నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. ఈ గిఫ్టులను పంచనున్నారట.
దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తనపుట్టిన రోజు నాడు ప్రధాని మోడీకి క్రెడిట్ ఇస్తూ.. బండి సంజయ్ పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇదేమీ.. పదో ఇరవయ్యో కాదు.. ఏకంగా 10 వేల మంది విద్యార్థులకు.. అది కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క సైకిల్‌కు 4000 రూపాయల చొప్పున ఖర్చు చేశారట. అంటే.. మొత్తంగా 4 కోట్ల రూపాయలను దీనికి వెచ్చించారు. ఈ సైకిళ్లను తన పుట్టిన రోజు కంటే రెండు రోజుల ముందుగానే పక్కాగా పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు.
కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. సైకిల్‌పై ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతోపాటు.. వెనుకాల ఒకరు కూర్చునే స్టాండును కూడా ఏర్పాటు చేశారు. ఇక, కరీంనగర్‌లో 3,096, సిరిసిల్లలో 3,841, జగిత్యాలలో 1,137, సిద్దిపేటలో 783, హనుకొండలో 491 మంది విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు బండి చెప్పుకొచ్చారు. మొత్తంగా బండి బర్త్‌డే గిఫ్టులపై జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత అట్టహాసంగా చేస్తారో చూడాలి.