అట్లుంటది మనతోని.. రాడార్‌కు చిక్కని డ్రోన్లు.. హైదరాబాద్ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ..


 

ఆ ఇద్దరు విద్యార్థులు హాస్టల్ గదిలో కూర్చుని మిగతా విద్యార్థుల మాదిరిగా కబుర్లు చెప్పుకోలేదు. సరికొత్త ఆవిష్కరణ దిశగా తమ ఆలోచనలకు పదును పెట్టారు. ఆ ఆలోచనను భారత సైనికాధికారులతో పంచుకున్నారు. ఓ అధికారి స్పందించి డెమో ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. ఇంకేం.. ఇప్పుడు ఏకంగా భారత సైన్యానికి తమ ఆలోచన ద్వారా తయారైన ఉత్పత్తులను విక్రయించే స్థాయికి చేరుకున్నారు.

ఆ ఇద్దరు విద్యార్థులు హాస్టల్ గదిలో కూర్చుని మిగతా విద్యార్థుల మాదిరిగా కబుర్లు చెప్పుకోలేదు. సరికొత్త ఆవిష్కరణ దిశగా తమ ఆలోచనలకు పదును పెట్టారు. ఆ ఆలోచనను భారత సైనికాధికారులతో పంచుకున్నారు. ఓ అధికారి స్పందించి డెమో ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. ఇంకేం.. ఇప్పుడు ఏకంగా భారత సైన్యానికి తమ ఆలోచన ద్వారా తయారైన ఉత్పత్తులను విక్రయించే స్థాయికి చేరుకున్నారు. ఈ విజయగాథకు వేదికైంది హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) క్యాంపస్. అక్కడి విద్యార్థులైన జయంత్ ఖత్రీ, సౌర్య చౌధురి హాస్టల్ గదిలో వచ్చిన ఆలోచనకు ఆవిష్కార రూపం ఇచ్చారు. ఆ ఇద్దరూ స్థాపించిన డిఫెన్స్ టెక్ స్టార్టప్ ‘అపోలియన్ డైనమిక్స్’ ఇప్పుడు రాడార్ల కన్నుగప్పి శరవేగంతో దూసుకెళ్లే కమికేజ్ డ్రోన్లను రూపొందించి భారత సైన్యానికి అందిస్తోంది. ఆ డ్రోన్లు ఇప్పటికే ఇండియన్ ఆర్మీలోని జమ్మూ, చండీమందిర్ (హర్యానా), పనగఢ్ (పశ్చిమ బెంగాల్), అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక యూనిట్లకు చేరుకున్నాయి.

ఈ విజయం వెనుక ఈ యువ ఆవిష్కర్తలు క్యాంపస్‌లోని ‘డిఫెన్స్ టెక్ క్లబ్‌’లో రోబోటిక్స్ పట్ల తమ అభిరుచిని పెంచుకున్నారు. తమ ఆలోచనలు పంచుకున్నారు. కేవలం రెండు నెలల క్రితం స్థాపించిన అపోలియన్ డైనమిక్స్, గంటకు 300 కిమీ వేగంతో ప్రయాణించే సాధారణ కమర్షియల్ డ్రోన్ల కంటే దాదాపు 5 రెట్లు వేగవంతమైన కమికేజ్ డ్రోన్లను రూపొందించింది. ఈ విజయగాథ గురించి జయంత్ ఖత్రీ మాట్లాడుతూ… తాను సైనికాధికారులకు ‘లింక్డ్ ఇన్’ ద్వారా కోల్డ్ ఈ-మెయిల్స్ పంపానని, ఒక కల్నల్ ర్యాంక్ అధికారి స్పందించి చండీగఢ్‌లో డెమో కోసం ఆహ్వానించారని తెలిపారు. అక్కడ ఇచ్చిన డెమో వారి జీవితాన్నే మార్చేసింది. ఆ ఆవిష్కరణ ఏకంగా దేశసేవలో భాగమైంది.

ఈ డ్రోన్ల ప్రత్యేకతలు

ఈ డ్రోన్లు కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌లు, ఏఐ-ఆధారిత నావిగేషన్ సిస్టమ్స్, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్‌తో తయారయ్యాయి. 1 కిలోగ్రాము బరువును అత్యంత ఖచ్చితత్వంతో మోసుకెళ్లగలవు. అదే సమయంలో రాడార్‌ కంటికి చిక్కకుండా నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించగలవు. ఈ డ్రోన్లు భారతదేశ భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. యుద్ధాలు, స్పెషల్ సైనిక ఆపరేషన్ల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని తయారయ్యాయి. అవసరమైన మార్పులు చేర్పులు చేయడానికి సైతం ఈ డ్రోన్లలో అవకాశం కల్పించారు.

సైన్యానికి శిక్షణ

అపోలియన్ డైనమిక్స్ కేవలం డ్రోన్ల తయారీతోనే ఆగలేదు. వారు సైనిక సిబ్బందికి ఈ డ్రోన్లను ఆపరేట్ చేయడంలో హ్యాండ్స్-ఆన్ శిక్షణను కూడా అందిస్తున్నారు. డ్రోన్ ఆపరేట్ చేయడంలో అనుభవం లేని సైనికులు కూడా కొద్ది రోజుల్లో ఈ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించగలరని సౌర్య చౌధురి తెలిపారు.

‘మేక్ ఇన్ ఇండియా’కు మద్దతు

ఈ ఇద్దరు విద్యార్థుల విజయం కేవలం సైనిక అవసరాలను తీర్చడమే కాదు, భారత ప్రభుత్వం సైనిక పరికరాల విషయంలో విదేశాలపై ఆధారపడకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో భారత్‌లోనే తయారు చేసుకోవాలన్న లక్ష్యాన్ని సైతం నెరవేర్చుతోంది. వీటిని పూర్తిగా స్వదేశీ సాంకేతిక, స్వదేశీ తయారీ డ్రోన్లుగా పేర్కొనవచ్చు. “విదేశీ రక్షణ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించాలనే మా లక్ష్యం” అని జయంత్, సౌర్య తమ ఆలోచనలను పంచుకున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

అపోలియన్ డైనమిక్స్ ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) ప్లాట్‌ఫారమ్‌లు, ఫిక్స్‌డ్-వింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తోంది. సవాళ్లతో కూడిన వాతావరణాల్లో సైతం సైనిక ఆపరేషన్లను సులభతరం చేస్తాయి. ఈ బృందంలో ఇప్పుడు ఆరుగురు సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. వీరు దీర్ఘ-శ్రేణి నిఘా, వ్యూహాత్మక దాడి మిషన్ల కోసం కొత్త డ్రోన్ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నారు.

సంస్థాగత మద్దతు

బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డీన్ డాక్టర్ సంకేత్ గోయల్ ఈ విద్యార్థుల విజయాన్ని ప్రశంసించారు. “వారు సాధించినది సామాన్య విజయం కాదు. వారి స్టార్టప్ ఇప్పటికే సైన్యం మల్టిపుల్ ఆర్డర్‌లను పొందింది” అని ఆయన అన్నారు. బిట్స్ పిలానీ ఛాన్సలర్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ విద్యార్థులను కలిసి, వారి ఆవిష్కరణలను ప్రశంసించారు.

“రోబోటిక్స్ పట్ల మా ఉమ్మడి అభిరుచి మమ్మల్ని ఒక్కటిగా చేసింది. నిజంగా ఒక సరికొత్త ఆవిష్కరణ లక్ష్యంతో మేము ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాము” అని కోల్‌కతాకు చెందిన సౌర్య చౌధురి తెలిపారు. ఒక కళాశాల హాస్టల్ గదిలో ప్రారంభమైన ఈ ఆలోచన ఇప్పుడు భారతదేశ ఆధునిక రక్షణ వ్యూహంలో కీలక భాగంగా మారింది.

Previous Post Next Post

نموذج الاتصال