జాతీయ రహదారులపై ప్రయాణించే కార్ల దగ్గర్నుంచి భారీ వాహనాల వరకు టోల్ ఫీజు కట్టాల్సిందే. ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు మాత్రం టోల్ ఫీజు లేదు. అయితే ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు కూడా టోల్ ఫీజు కట్టాల్సిందేనంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జూలై 15వ తేదీ నుంచే ఈ నిబంధనను అమల్లోకి తీసుకురాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ద్విచక్రవాహనాలకు టోల్ ట్యాక్స్ విధిస్తున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని గడ్కరీ స్పష్టం చేశారు. ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు అర్థం కావడం లేదని, కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వార్తలను వండి వారుస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
ద్విచక్రవాహనాలకు టోల్ ట్యాక్స్ పూర్తి మినహాయింపు ఎప్పటిలాగానే కొనసాగుతుందని, జులై 15 నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ఇలా ప్రజలను తప్పుదారి పట్టించే వార్తలను ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. అలాగే ఎన్‌హెచ్ఏఐ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ టోల్ ఫీజు ప్రతిపాదనేది లేదని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది