స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇవాళ(సోమవారం) విచారణ జరిపింది. ఆరు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటీషనర్లను ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదని కొంత సమయం కావాలని కోర్టుని ప్రభుత్వం కోరింది.
ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించాలని పిటీషనర్లు వాదనలు వినిపించారు. ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని.. కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటీషనర్లు వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2024 ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.