Fake e-stamps: అనంతపురం జిల్లా కంప్యూటర్‌ ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు


 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ.. నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణానికి తెరలేపిన బోయ ఎర్రప్ప అలియాస్‌ మీ సేవ బాబు వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

నకిలీ ఈ-స్టాంపు’ల స్కాంలో భారీగా సంపాదించిన ఎర్రప్ప

  • ఎర్రప్ప, భార్య బ్యాంకు ఖాతాల్లో కోటికి పైగా నగదు

  • రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం?

  • ఇంటర్‌ చదివి.. మీసేవా కేంద్రం ఏర్పాటు

  • నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, పట్టాదారు పుస్తకాలూ తయారీ

  • రెవెన్యూ సిబ్బంది, అధికారులతోనూ సాన్నిహిత్యం.. వారినీ విచారించే అవకాశం

  • ఎర్రప్పకు సన్నిహితులైన టీచర్లనూ విచారిస్తున్న పోలీసులు

  • సిట్‌ ఏర్పాటుకు ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా ఎండీ వినతి

  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ.. నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణానికి తెరలేపిన బోయ ఎర్రప్ప అలియాస్‌ మీ సేవ బాబు వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 2019లో మీసేవ కేంద్రం పెట్టి.. కేవలం ఆరేళ్లలో రూ.కోట్లకు పడగలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన భార్య బ్యాంకు ఖాతాల్లో కోటికి పైగా నగదు ఉన్నట్లు తేలడాన్ని బట్టి అతడి అక్రమాలు ఏ స్థాయిలో జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ ఆడిట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నకొద్దీ ఎర్రప్ప బాగోతాలు బయటపడుతున్నాయి.

  • 13 వేల ఈ-స్టాంపుల విక్రయం

    ఎర్రప్ప తన భార్య కట్ట భార్గవి పేరుతో స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి 2020లో ఈ-స్టాంపుల విక్రయ లైసెన్సు తీసుకున్నాడు. కళ్యాణదుర్గం పట్టణంలో వీరికి మాత్రమే ఈ-స్టాంపుల లైసెన్సు ఉంది. తనకున్న పరిచయాలతో ఈ-స్టాంపులను ఇష్టానుసారంగా అమ్మేశాడు. రూ.100 నుంచి రూ.200 ఈ- స్టాంపులను ఫొటోషా్‌పలో ట్యాంపరింగ్‌ చేసి ఒక్కొక్కటి రూ.లక్ష వరకు అమ్మినట్లు సమాచారం. బ్యాంకు రుణాలు, రిజిస్ర్టేషన్లకు స్టాంప్‌ డ్యూటీని చెల్లించేందుకు ఈ-స్టాం్‌పలను వినియోగిస్తారు. రూ.100 విలువైన స్టాంపులకు ఫొటోషా్‌పలో అదనంగా సున్నాలు జోడించి.. అవసరమైనవారికి రూ.లక్షకు విక్రయించేవాడు. గడచిన నాలుగేళ్ల వ్యవధిలో సుమారు 13 వేల ఈ-స్టాంపులను అమ్మి కోట్లాది రూపాయాలు అక్రమ మార్గంలో సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.

  • ప్రభుత్వ ఉపాధ్యాయులను విచారిస్తున్న పోలీసులు

    ఎర్రప్పకు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. కీలకమైన రెవెన్యూ అధికారులనూ విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎర్రప్ప, భార్య భార్గవి బ్యాంకు ఖాతాలలో రూ.కోటికి పైనే నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఎర్రప్ప మీసేవ కేంద్రంలో పనిచేస్తున్న కంబదూరు మండలానికి చెందిన ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణదుర్గం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇదే మీ సేవ కేంద్రంలో పనిచేస్తుండగా, అతడి బ్యాంకు ఖాతా ద్వారా చాలా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. నకిలీ ఈ-స్టాంపులు తీసుకుని మోసపోయినవారు ఒక్కొక్కరుగా పోలీసులు వద్దకు వస్తున్నారు.


    ఎవరీ ఎర్రప్ప..

    కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ఎర్రప్పది సామాన్య రైతు కుటుంబం. ఇంటర్‌ చదివాడు. కంప్యూటర్‌ నేర్చుకుని ఆపరేటర్‌గా చిన్నచిన్న పనులు చేసుకునేవాడు. 2019లో కళ్యాణదుర్గం తహసీల్దారు కార్యాలయం ఎదుట మీ-సేవ కేంద్రాన్ని(బాబు మీ సేవ కేంద్రం) ఏర్పాటు చేశాడు. కీలకమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, అక్రమ మార్గంలో ఎదుగుతూ వచ్చాడు. సంపాదన ధ్యేయంగా ఈ-స్టాంపుల టాంపరింగ్‌ ప్రారంభించాడు. మీ సేవ కేంద్రంలో ఎర్రప్ప కొన్నేళ్లపాటు ఆధార్‌ కేంద్రాన్ని నడిపాడు. ఈ క్రమంలో నకిలీ ధ్రువపత్రాలను వినియోగించి నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించాడు. దీంతో అధికారులు అతని ఆధార్‌ కేంద్రాన్ని మూసివేయించారు. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను భారీగా తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గతంలోనే బయటపడినా, అధికారులు.. తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారు.


    మేం బాధితులం.. బాధ్యులం కాదు

    సిట్‌ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎస్‌ఆర్‌సీ ఎండీ యశ్వంత్‌, ఆడిటర్‌ వినతి

    నకిలీ స్టాంపుల స్కాంపై తామే మొదట పోలీసులు ఫిర్యాదు చేశామని ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిలినేని యశ్వంత్‌ అన్నారు. ఈ వ్యవహారంలో తాము బాధితుమని, బాధ్యులం కాదని స్పష్టం చేశారు. ఆ సంస్థ ఆడిటర్‌ బాలాజీ, జీఎం సతీ్‌షతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోయ ఎర్రప్ప.. తనభార్య భార్గవి పేరిట మీసేవ కేంద్రాన్ని నడుపుతున్నారని, వారు స్టాంప్‌ పేపర్లను టాంపరింగ్‌ చేసి తమను మోసగించారని అన్నారు. తాము రూ.లక్ష ఇస్తే.. వారు రూ.100 స్టాంప్‌ను రూ.1,00,000గా మార్చి తమకు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయం తమ సంస్థ అంతర్గత ఆడిట్‌లో బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కానీ, కొన్ని మీడియా సంస్థలు తాము స్టాంప్‌ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఇలా చేయించామని ఆరోపణలు చేస్తున్నాయని, రూ.లక్ష ఎగ్గొడితే తాము బ్యాంకు ద్వారా ఎందుకు పేమెంట్‌ చేస్తామని ప్రశ్నించారు.

    DD.jpg


    ఎర్రప్ప నుంచి గత రెండేళ్లలో 463 స్టాంప్‌ పేపర్లు కొన్నామని, వాటి విలువ రూ.23 లక్షలు అని తెలిపారు. అందులో రూ.100, రూ.5 వేలు, రూ.7 వేల విలువైన స్టాంపులు సరిగానే ఉన్నాయని అన్నారు. కానీ రూ.లక్షల విలువైన స్టాంప్‌ పేపర్లలో కొన్ని అవకతవకలు చేశారని తెలిపారు. ఎస్‌ఆర్‌సీకి అనేక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల, గుంతకల్లు, హిందూపురం, అనంతపురం, కళ్యాణదుర్గం.. ఇలా అనేక ప్రాంతాల్లో తమ సంస్థ ఈ-స్టాంపులను కొనుగులు చేస్తూ ఉంటుందన్నారు. అయితే ఎక్కడా ఇలాంటివి జరగలేదని, కళ్యాణదుర్గంలోనే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. తమ సంస్థ 27 ఏళ్ల క్రితం పుట్టిందని, ఎక్కడా ఎలాంటి మచ్చ లేదని స్పష్టం చేశారు. కానీ, తమ సంస్థ పేరిట ఉన్న బ్లాంక్‌ స్టాంప్‌ పేపర్‌ను వాడుకుని కొన్ని మీడియా సంస్థలు, చానళ్లు బురద చల్లాలని చూస్తున్నాయని ఆరోపించారు. నకిలీ స్టాంపుల స్కాం రాష్ట్రంలో ఎక్కడైనా జరిగి ఉండవచ్చని, దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేయాలని తాము ప్రభుత్వాన్ని కోతున్నామని అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال