పిన్‌ కోడ్‌కు ఇక సెలవు!

  



చిరునామా రాసేటపుడు ఉపయోగించే పిన్‌ (పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌) కోడ్‌ అవసరం తగ్గబోతున్నది. తపాలా శాఖ కొత్తగా డిజిటల్‌ చిరునామా విధానం డిజిపిన్‌ను ప్రారంభించింది. పిన్‌ కోడ్‌ ఓ ప్రాంతానికి సంబంధించినది కాగా, డిజిపిన్‌ ఓ ఇల్లు లేదా భవనానికి కచ్చితమైన గుర్తింపు సంఖ్య. దీనిలో 10 క్యారెక్టర్లు (అంకెలు, అక్షరాలు, గుర్తులు) ఉంటాయి.

డిజి పిన్‌ను ఆవిష్కరించిన పోస్టల్‌ శాఖ

ఇది మన దేశ కొత్త చిరునామా వ్యవస్థ

న్యూఢిల్లీ, జూన్‌ 5: చిరునామా రాసేటపుడు ఉపయోగించే పిన్‌ (పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌) కోడ్‌ అవసరం తగ్గబోతున్నది. తపాలా శాఖ కొత్తగా డిజిటల్‌ చిరునామా విధానం డిజిపిన్‌ను ప్రారంభించింది. పిన్‌ కోడ్‌ ఓ ప్రాంతానికి సంబంధించినది కాగా, డిజిపిన్‌ ఓ ఇల్లు లేదా భవనానికి కచ్చితమైన గుర్తింపు సంఖ్య. దీనిలో 10 క్యారెక్టర్లు (అంకెలు, అక్షరాలు, గుర్తులు) ఉంటాయి.

దీనిని ఉపయోగించినప్పటికీ తపాలా చిరునామా మారదు. అయితే, డిజిపిన్‌ అనేక రంగాలకు విస్తరించిన తర్వాత, జీఐఎస్‌ సిస్టమ్స్‌తో ఇంటిగ్రేట్‌ అయిన అనంతరం సవివరమైన తపాలా చిరునామాను ఇవ్వవలసిన అవసరం తగ్గుతుంది.


ముఖ్యమైన ప్రయోజనాలు

4 చదరపు మీటర్ల వైశాల్యంలో కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించవచ్చు.

అత్యవసర సేవలు, డెలివరీస్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

అన్ని రకాల ప్రదేశాలకు ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు.

వ్యక్తిగత డాటాను స్టోర్‌ చేయరు కాబట్టి వ్యక్తిగత గోప్యత ఉంటుంది.

డిజిపిన్‌ గురించి

ఇది దేశవ్యాప్తంగా జియోకోడెడ్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌. దీనిని ఐఐటీ హైదరాబాద్‌, ఇస్రోలోని ఎన్‌ఆర్‌ఎస్‌సీలతో కలిసి తపాలా శాఖ అభివృద్ధి చేసింది. ఇది భారత దేశాన్ని సుమారు 4m x 4m గ్రిడ్స్‌ (ఇండ్లు, కార్యాలయాలు, సంస్థలు మొదలైనవాటి)గా విభజిస్తుంది. ప్రతి గ్రిడ్‌కు అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా 10 క్యారెక్టర్ల ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్‌ను ఇస్తుంది.


పిన్‌కోడ్‌, డిజిపిన్‌ మధ్య తేడా

సాధారణ తపాలా చిరునామాలో ప్రాంతం, వీథి, ఇంటి నంబరు ఉంటాయి. డిజిపిన్‌లో 10 క్యారెక్టర్ల ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్‌ ఉంటుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల స్థానాల ఆధారంగా ఉంటుంది. స్పష్టమైన చిరునామా చెప్పే అవకాశం లేని గ్రామీణ ప్రాంతాలు, అడవులు, మహా సముద్రాలు వంటివాటిలో డిజిపిన్‌ ఎంతో ఉపయోగకరం.


ఆఫ్‌లైన్‌లోనూ..

డిజిపిన్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్‌ కోడ్‌ను తపాలా శాఖ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచింది. దీని ద్వారా ప్రజలు డిజిపిన్‌ను డీకోడ్‌ చేయవచ్చు.


డిజిపిన్‌ను ఎలా పొందాలి?

https://dac.indiapost.gov.in/mydigipin/home వెబ్‌సైట్‌ ద్వారా డిజిపిన్‌ను పొందవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ ఇంటిని గుర్తించి, డిజిపిన్‌ను సృష్టించవచ్చు. అంబులెన్స్‌, అగ్నిమాపక శకటాలు వంటి అత్యవసర సేవలు సకాలంలో అందడానికి ఈ డిజిపిన్‌ దోహదపడుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలవారికి ప్రయోజనకరం. అంతేకాకుండా ఆన్‌లైన్‌ షాపర్స్‌, లాజిస్టిక్స్‌ ప్రొవైడర్స్‌ వంటివారికి, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ వేగంగా, కచ్చితంగా డెలివరీ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

Previous Post Next Post

نموذج الاتصال