ఈ పాప బతకడానికి ఓ ఇంజక్షన్ చేయాలి.. దానికి ధర అక్షరాల రూ.16 కోట్లు..!
బోసి నవ్వులతో కనిపిస్తున్న ఈ పాప నవ్వుల వెనుక అంతులేని విషాదం దాగి ఉంది. ఓ అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతోంది. చిన్న వయసులోనే ఎంతో బాధను అనుభవిస్తోంది. ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే ఆ పాపకు అక్షరాల రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పుడే ఆ పాప ఆరోగ్యంగా జీవించగలదంటున్నారు. దీంతో చిరు ఉద్యోగి అయిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలో చైతన్య నగర్‌కు చెందిన డొక్కా ఈశ్వర్, శ్రావణిల కుమార్తె మోహనకు అత్యంత అరుదైన వ్యాధి వచ్చింది. తొలి సంతానంలోనే ఈ పాప పుట్టిందనే ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. రెండు నెలలకే ఆ పాప అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి వెళ్తే, ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. స్పైనల్ మస్కుయలర్ ఆట్రోఫీ (ఎస్‌యంఏ) టైప్-1 సమస్య వచ్చిందని వైద్యులు చెప్పారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్, రైన్‌బో ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అయితే ఈ అమ్మాయికి రెండు ఏళ్లలోపు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడు మాత్రమే ఆ పాప ఆరోగ్యంగా ఉండగలుగుతుందన్నారు వైద్యులు. లేకపోతే పాప ప్రాణాలకే ప్రమాదం అన్నారు. అప్పటివరకు ఆరు లక్షల రూపాయల విలువైన సిరప్‌ను పాపకు అందించాల్సి ఉంటుంది అన్నారు.
కడియం ఎపి పేపర్ మిల్లు లో పాప తండ్రి ఈశ్వర్ చిరు ఉద్యోగి. అతని జీతం డబ్బులతో కుటుంబపోషణే భారంగా ఉంటుంది. అలాంటిది ఈ పాపకు ఖరీదైన వైద్యం అంటే మామూలు విషయం కాదు. అందుకే తమ పాప బతకాలంటే దాతలు సహకరించండి అంటూ ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతల సహకారం అందించాలని కోరుతున్నారు. ఆ పాపను ఆదుకోవాలని, ఆర్థిక సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే పాప బతుకుతుందంటున్నా తండ్రి ఈశ్వర్. పాప ప్రాణం నిలిపేందుకు చిన్నారి తండ్రి ఫోన్ నెంబర్.. 94411-01670 కు సంప్రదించాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.