ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ను అష్ట దిగ్బంధం చేయడమే లక్ష్యంగా కాషాయ నేతలు పని చేస్తున్నారు. శాసన సభలో 8 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలతో బీజేపీ వాయిస్ మరింత పెరగనుంది. దీంతో బలంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం దక్కినట్లు అయింది. తెలంగాణలో కాషాయ జెండా రెపరపలాడింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు కైవసం చేసుకుని కమలనాథులు సత్తా చాటారు. శాసన మండలిలో బలం పెంచుకోవడంతోపాటు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేసింది భారతీయ జనతా పార్టీ విజయం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలో రెట్టింపు ఓటింగ్ శాతంతో 8 ఎంపీ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీకి 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీల్లో ఇద్దరు కేంద్రమంత్రులుగా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకు ముందు ఈ తరహాలో అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం లేదు. 2023 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినా.. ఆ తర్వాతి పరిణామాలను ఒక్కొక్కటిగా తమకు అనుకూలంగా మలుచుకుంటూ కమలదండు కదులుతోంది.
పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతి అంశాన్ని అధికారపక్షంతో పోటీపడి తామే ఫ్రేమ్లో ఉండేలా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. మూసీ ప్రక్షాళన ఇష్యూ, గత బీఆర్ఎస్ పాలన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు, ఆరు గ్యారంటీ ల అమలుపై పోరాటం, రైతు సమస్యలపై ధర్నాలతో రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పటిష్టం చేసుకుంటుంది. గత పదేళ్ల కేసీఆర్ పాలన ను ప్రజలు తిరస్కరిస్తే.. రేవంత్ పాలనపై 14 నెలలోనే అంత వ్యతిరేకత వచ్చిందని కాషాయ నేతలు జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని రుజువు చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడింట రెండు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేసిన కాంగ్రెస్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకత, బీజేపి పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం అని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికలలో సత్తా చాటేందుకు ఈ విజయం బీజేపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ కానుందంటున్నారు కమలనాథులు. అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు పెద్దలు సభలో సంఖ్య బలం పెంచుకుని నిరూపించారు. మరో వైపు బీఆర్ఎస్‌ను కోలుకోకుండా చేసి, ఆ గ్యాప్‌లో బీజేపీ ఫిట్ అవ్వాలని చూస్తోంది. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ అంతా కమలం వైపు టర్న్ అవడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తోంది. బీఆర్ఎస్ చెబుతున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చినా అవి బీజేపీకే కలిసొచ్చే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.
డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా తెలంగాణ ప్రజలను మైండ్ సెట్ చేయడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. ఉమ్మడి ఏడు జిల్లాల్లో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు గెలించింది భారతీయ జనతా పార్టీ. ఉత్తర తెలంగాణలో పూర్తిగా తమ పట్టును నిలుపుకుంది. అదే ఊపుతో రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చిన మెజారిటీ అవకాశం తమకే ఉంటుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా పార్టీని బలోపేతం చేసేలా అగ్రనేతలు ఫోకస్ చేశారు. మంద కృష్ణ మాదిగ ద్వారా ఎస్సీ లకి చేరువైతే.. ఆర్ కృష్ణయ్య కి రాజ్యసభ ఇచ్చి బిసి వర్గాలను ప్రభావితం చేసేలా ప్రణాళికలు వేశారు.
మరోవైపు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ను అష్ట దిగ్బంధం చేయడమే లక్ష్యంగా కాషాయ నేతలు పని చేస్తున్నారు. శాసన సభలో 8 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలతో బీజేపీ వాయిస్ మరింత పెరగనుంది. దీంతో బలంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం దక్కినట్లు అయింది. అటు కేంద్రంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు మరో ఆరుగురు ఎంపీలు, లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులతో పార్లమెంట్ తెలంగాణ బీజేపీ ప్రాతినిధ్యం కొనసాగనుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే.. నెక్స్ట్ స్టాప్ అసెంబ్లీ ఎన్నికలే అని, అక్కడ విజయఢంకా మోగించి అధికార పగ్గాలు చేపట్టాలని కాషాయ దండు భావిస్తోంది.