హోలీ 2025
హిందువులు జరుపుకునే పండగల్లో రంగుల పండుగ హోలీ.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. రంగులు, బెలూన్స్ , లేదా కోడి గుడ్లు, టమాటా వంటివి వాటితో రంగుల కేళీ హోలీని ఆడుతారు . వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రాదయాలకు అనుగుణంగా హోలీ పండుగను జరుపుకుంటారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో హోలీని ఐదు రోజుల పాటు జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు ఇలా రకరకాలుగా జరుపుకుంటారు. మన దేశంలో మాత్రమే కాదు హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హోలీ వేడుకలను వివిధ రూపాల్లో పేర్లతో జరుపుకుంటారు.
కొన్ని చోట్ల పూలతో, మరికొన్ని చోట్ల రంగులు, గులాల్‌లతో హోలీ ఆడతారు, కొన్ని చోట్ల ధైర్యం, పరాక్రమం హోలీ వేడుకల్లో కనిపిస్తాయి. రంగుల గొప్ప పండుగ హోలీని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
హోళీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది రంగుల పండుగ మాత్రమే కాకుండా.. అనేక పురాణ కథలతో ముడిపడి ఉంది. శివుడి కామదహనం, హోళికా దహనం, రాధా కృష్ణుల రంగుల ఆటలు ఈ పండుగకు ప్రాముఖ్యతను పెంచాయి. హోళీ సామాజిక ఐక్యత, ఆనందం, సంప్రదాయాలను వ్యక్తపరిచే పండుగగా నిలుస్తుంది. ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని వ్యవసాయ పనులకు సంబంధిస్తే, మరికొన్ని ఋతువుల మార్పును సూచిస్తాయి. ప్రకృతిని కొలిచే పండుగలుంటే, కుటుంబ బంధాలను చాటే పండుగలు కూడా ఉంటాయి. హోళీ మాత్రం వీటన్నింటికంటే భిన్నం. ఇది పూర్తిగా సామాజికమైన పండుగ. ఇందులో ప్రత్యేకమైన పూజల కంటే రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యంగా భావిస్తారు. హోళీ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
కామదహనం కథ
తెలుగునాట హోళీని కామదహనం లేదా కాముడి పౌర్ణమిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తన అమితబలంతో రుషులు, ప్రజలను బాధించసాగాడు. అతనికి శివుని సంతానం చేత మాత్రమే మరణం జరుగుతుందనే వరం ఉండటంతో అతనికి అడ్డుకట్ట వేయడం కష్టమైంది.
శివుడు దీర్ఘకాలం తపస్సులో ఉండటంతో పార్వతిని ఆశీర్వదించేందుకు కాముడు తన ప్రేమ బాణాన్ని ప్రయోగించాడు. తపస్సుకు భంగం కలిగిన శివుడు కోపంతో తన మూడో కన్నును తెరిచాడు. దాంతో కాముడు భస్మమయ్యాడు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ హోళీ పండుగనాడు కామదహనం నిర్వహిస్తారు.
హోళికా దహనం కథ
ఈ కథ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని చుట్టూ తిరుగుతుంది. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషిగా ఉండగా అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమవిష్ణుభక్తుడు. ప్రహ్లాదుడిని మార్చాలని చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి హిరణ్యకశిపుడు అతనిని హతమార్చాలని నిర్ణయించాడు.
హిరణ్యకశిపుని చెల్లెలు హోళికకు అగ్ని దహింపజాలదనే వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చొని మంటల్లో కాల్చాలని ప్రయత్నించింది. కానీ ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షించగా.. హోళికా దహనమైంది. ఈ సంఘటనకు గుర్తుగా హోళీకి ముందురోజు హోళికా దహనం జరుపుతారు.
రాధాకృష్ణుల హోళీ కథ
కృష్ణుడు చిన్నప్పుడు నల్లగా ఉండేవాడు. కానీ రాధాదేవి తెల్లని చాయతో ఉండేది. కృష్ణుడు తన తల్లి యశోదను దీనిపై ప్రశ్నించగా ఆమె ఎలాంటి రంగులోకైనా నీవు నీ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకోవచ్చు అని చెప్పింది.
దీంతో కృష్ణుడు గోపికలపై రంగులు చల్లడం ప్రారంభించాడు. అప్పటి నుంచి హోళీ పండుగను రంగుల ఆటగా జరుపుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలోని మధుర, బృందావన్ ప్రాంతాల్లో హోళీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
హోళీ రంగుల పండుగ మాత్రమే కాదు.. అనేక పౌరాణిక కథలతో ముడిపడి ఉంది. భారతీయ సంస్కృతిలో భోగి, హోళీ లాంటి పండుగలు ఆనందాన్ని, ఐక్యతను పెంచే విధంగా రూపొందాయి. ఈ పండుగలో రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ఆనవాయితీగా మారింది. హోళీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పండుగ.