తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో బహిరంగ సభ నిర్వహించి, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు అండగా నిలువడం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఉద్యోగ నియామకాలు తన ప్రభుత్వం చేస్తున్న కీలక కార్యక్రమాలని ప్రకటించారు. కిషన్ రెడ్డిని తీవ్రంగా ఖండించి, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కోరారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కొంతమంది ఓర్వలేకపోతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆదివారం వనపర్తి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు, ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లో రాణించడంలో వనపర్తి పాత్ర ఎంతో ఉందని, వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారాన్ని ఇచ్చిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వనపర్తి ప్రాంతంలో ఎన్నటికి తెగిపోని బంధం నాది. వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐదేళ్ల క్రితం వనపర్తి లో గెలిచిన ఎమ్మెల్యే రాజకీయాలను కలుషితం చేశారు. వనపర్తి లో అనేక విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయి. వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యం తోనే తెలంగాణ ముఖ్యమంత్రి గా మీ ముందు నిలబడ్డ” అని రేవంత్ వెల్లడించారు.
మహిళలపై పేరు మీద ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ను మహిళల పేరుతో ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు క్రియాశీలకంగా పనిచేశారని, 10 ఏళ్లలో కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, కాని ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం లో మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడించారు.
పదేళ్ల పాటు ఫామ్ హౌస్ లో పడుకుని.. కేసీఆర్ పదేళ్ల పాటు ఫామ్ హౌస్‌లో పడుకొని ప్రజల గురించి ఆలోచించలేదని సీఎం రేవంత్ విమర్శించారు. పదేళ్లలో ప్రాజెక్టులు కడితే పాలమూరు ప్రజలు ఎందుకు వలస పోతున్నారని, వలసలు పోతున్న పాలమూరు ప్రజల గురించి కేసీఆర్ ఏనాడైనా ఆలోచించారా? పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్‌ను ఎందుకు పూర్తి చేయలేదు? బీమా, కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదు..? ఆర్డీఎస్ ఎందుకు ఎండిపోయింది..? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ పదేళ్ల పాటు పడావు పెట్టడంతో కుప్పకూలిపోయిందని, ఈ పాపం కేసీఆర్‌ది కాదా..? అని రేవంత్ ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించుకుంటు కేసీఆర్ చూడలేదా? ప్రగతి భనవ్ కు జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నం పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాది రాయి వేసింది కేసీఆర్ కాదా? రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అనలేదా? మహబూబ్ నగర్ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని ఎంపీ గా గెలిపించుకుంటే కేసీఆర్ ఏం చేశావు? అని మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు సీఎం రేవంత్.
పాలమూరు రుణం తీర్చుకుంటా.. పాలమూరు రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యానని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరును పడాగ పెట్టింది కేసీఆరే.. నమ్మినందుకు నట్టేట ముంచాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమని బీఆర్ఎస్ సన్నాసులు అంటున్నారు. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారని విమర్శించారు. పాలమూరు బిడ్డలకు పరిపాలించే శక్తి లేదా? అని ప్రశ్నించారు. పాలమూరు వాళ్లది అమాయకత్వం కాదు మంచితనం.. తిక్క రేగితే డొక్క చీల్చి డోలు కడతం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కేసీఆర్ చెప్పే హరికథలు, పిట్టకథలు నడవు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదినది పాలమూరు బిడ్డ జిల్లెల చిన్నారెడ్డి, నానా కష్టాలు పడి వరంగల్ కు ఎయిర్ పోర్టు తీసుకువస్తే కిషన్ రెడ్డి నేనే తీసుకువచ్చానని చెపుతున్నాడు అని సీఎం అన్నారు.
కిషన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు! మెట్రో విస్తరణ అనుమతులు, మూసీ నది ప్రక్షాళనకు నిధులు, రీజనల్ రింగ్ రోడ్డు కు అనుమతులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి నీటి కేటాయింపులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, మోదీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో కిషన్ రెడ్డి లెక్కపెట్టి చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో మోదీ రెండు బోడి ఉద్యోగాలు ఇచ్చాడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ లో వరదలు వచ్చి కొట్టుకుపోతే కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని సీఎం అన్నారు. కిషన్ రెడ్డి కడుపు నిండా అసూయ, కుళ్ళు పెట్టుకుని కాళ్లలో కట్టెలు పెడుతున్నాడు, హైదరాబాద్ కు కేంద్ర మంత్రి వచ్చి సమీక్ష చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు హాజరుకాలేదు? ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి వస్తే గల్లీలో ఉన్న నువ్వు ఎందుకు సమీక్షకు రావు? కిషన్ రెడ్డి దుర్భుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు అని సీఎం రేవంత్ విమర్శించారు.
అందరం కలిసి కేంద్రాన్ని అడుగుదాం.. రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, నిధులపైన అన్ని పార్టీల ఎంపీలతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, అందరం కలిసి కేంద్రం దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడుగుదామని సీఎం రేవంత్ కోరారు. నిర్మలా సీతారామన్ తమిళనాడుకు మెట్రో తీసుకువెళ్లారు, కేంద్ర మంత్రి శోభా బెంగళూరు కి మెట్రో తీసుకెళ్లారు, సొంత రాష్ట్రం తెలంగాణ కు కిషన్ రెడ్డి ఎందుకు మెట్రో తీసుకురాడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన చేస్తే కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది, మూసీ ప్రక్షాళన కు ఎందుకు కిషన్ రెడ్డి నిధులు తీసుకురావడం లేదు? కిషన్ రెడ్డి ఎందుకు పాములా బుస కొడుతున్నవు..ఎందుకు పగ పడుతున్నవు? తెలంగాణ కు ఏదో ఒకటి చేయాలని మోదీ సానుభూతి తో ఉన్నాడు.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని సీఎం విమర్శించారు. తన మిత్రుడు కేసీఆర్‌కు అధికారం పోయిందని కిషన్ రెడ్డి బాధపడుతున్నాడని అన్నారు.