డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో ఎట్టకేలకు దుండగుడు పోలీసులకు చిక్కాడు.


 హైదరాబాద్, మార్చి 18: బీజేపీ ఎంపీ డీకే అరుణ (BJP MP DK Aruna) ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎంపీ ఇంట్లోకి చొరబడ్డ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం. నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు... ఏం ఎత్తుకెళ్లాడు.. ఇంట్లో చొరబడటానికి కారణం ఏంటి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు (మంగళవారం) చోరీపై పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా... గత ఆదివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లోని డీకే అరుణ ఇంట్లోకి దుండగుడు ప్రవేశించడం తీవ్ర సంచలనం రేపింది. ఫేస్ కనిపించకుండా ముసుగు, గ్లౌజులు ధరించిన దుండుగుడు అర్ధరాత్రి సమయంలో ఎంపీ ఇంట్లోకి వెళ్లాడు. ఎంతో చాకచక్యంగా కిచెన్, హాలులోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఆఫ్ చేశాడు. దాదాపు గంటన్నర పాటు ఆ దొంగ ఇంట్లో కలయతిరిగాడు. దొంగ ఇంట్లోకి ప్రవేశించడంపై వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దొంగ వచ్చిన సమయంలో ఇంట్లో డీకే అరుణ లేరు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే డీకే అరుణ ఇంట్లో దుండగులు ఎలాంటి చోరీకి పాల్పడలేదని పోలీసులు చెప్పారు. మరి దుండగుడు ఎందుకు ఇంట్లోకి చొరబడ్డారనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అలాగే దుండగుడి అంశంపై డీకే అరుణ కూడా స్పందించారు. తమ ఇంట్లోకి దుండగుడు ప్రవేశించాడని, కానీ ఎలాంటి వస్తువులు చోరీ చేయలేదని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. తనకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ కోరారు. ఇంటి వెనకవైపు నుంచి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి.. దాదాపు గంట పాటు ఇంట్లో తిరిగాడని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్, సీపీ కూడా కాల్ చేసి వివరాలు అడిగినట్లు తెలిపారు. అయితే దొంగ చొరబడ్డ సమయంలో తన మనవరాలు ఉందని.. ఒకవేళ దొంగను తన మనవరాలు చూసి ఉంటే.. ఆ దొంగ ఏం చేసేవాడో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ ఘటనతో ఇంట్లో వాళ్లంతా భయభ్రాంతులకు గురవుతున్నారని.. తనకు భద్రతను మరికాస్త పెంచాలని ఎంపీ కోరారు. మొత్తానికి బీజేపీ ఎంపీ ఇంట్లోకి దొంగ ప్రవేశించడం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me